Jagan-Sharmila : జగన్, షర్మిల ఆస్తుల వివాదం ఏంటి.. ఎవరిది తప్పు..?

Qubetvnews - October 27, 2024 / 08:57 AM IST

Jagan-Sharmila : జగన్, షర్మిల ఆస్తుల వివాదం ఏంటి.. ఎవరిది తప్పు..?

Jagan-Sharmila : ఏపీ రాజకీయాల్లో జగన్, షర్మిల ఆస్తుల వివాదం ఇంకా ముదురుతూనే ఉంది. ఇన్ని రోజులు వీరిద్దరి మధ్య రాజకీయంగా వైరం ఉండేది. కానీ ఇప్పుడు ఆస్తుల వివాదంగా మారింది. అసలు ఈ ఆస్తుల వివాదం ఏంటి.. ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత 2019 ఆగస్టు 31న జగన్, షర్మిల మధ్య ఎమ్ వోయూ ఒప్పందం కుదిరింది. ఈడీ, సీబీఐ అటాచ్ మెంట్ అయిన తర్వాత సరస్వతి పవర్ కంపెనీలో షేర్లను నీ పేరు మీదకు బదిలీ చేస్తాను అని జగన్ ఒప్పందం చేసుకున్నారు. అంత వరకు ఆ కంపెనీలో వాటాదారుగా ఉన్న తన తల్లి విజయమ్మ పేరు మీదకు గిఫ్ట్ డీడ్ కింద షేర్లను బదిలీ చేశారు.

చట్టం ప్రకారం.. అటాచ్ మెంట్ లో ఉన్న ఆస్తులను బదిలీ చేయడానికి వీలుండదు. ఒకవేళ అప్పటికే ఆ కంపెనీలో ఎవరైనా వాటాదారుగా ఉంటే.. వారి పేరు మీదకు మాత్రమే బదిలీ చేసుకోవచ్చు. అంతే తప్ప అమ్మడానికి, కొనడానికి వీలుండదు. అయితే విజయమ్మ పేరు మీదకు మార్చిన ఈ షేర్లను షర్మిల తమకు తెలియకుండా బదిలీ చేసుకుందని జగన్, ఆయన భార్య భారతి ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆయన లేఖ కూడా రాశారు. నా తండ్రి బతికి ఉన్నప్పుడే ఆయన సంపాదించిన ఆస్తుల్లో ఇద్దరికీ సమానంగా వాటాల పంపకాలు జరిగిపోయాయి.

ఆ తర్వాత నేను సొంతంగా కష్టపడి ప్రారంభించిన కంపెనీల్లో నా చెల్లెలు మీద ఉన్న ప్రేమతోనే వాటాలు ఇస్తానని చెప్పాను. దాని కోసం ఎమ్ వోయూ చేస్తే.. ఆమె నాకు తెలియకుండా నా తల్లి నుంచి షేర్లను బదిలీ చేసుకుంది. రాజకీయంగా నాకు వ్యతిరేకంగా మారింది. ప్రేమతో రాసిచ్చిన ఈ షేర్లను ఇప్పుడు ఆమె వ్యతిరేకంగా మారింది కాబట్టి వెనక్కు తీసుకుంటున్నాను అన్నారు. తన తండ్రి చనిపోయిన తర్వాత తన చెల్లెలకు తన అమ్మ ద్వారా నేరుగా రూ.200 కోట్లు ఇచ్చానని ఇదంతా ప్రేమతోనే చేస్తే.. ఇప్పుడు తనను వ్యతిరేకిస్తోంది కాబట్టి.. ఆమె మీద ప్రేమ చూపించాల్సిన అవసరం లేదన్నారు. ఒకవేళ షర్మిల, ప్రవర్తనలో మార్పు వస్తే.. అటాచ్ మెంట్ అయిపోయిన తర్వాత ఆ షేర్ల పంపకాలపై ఆలోచిస్తానన్నారు. పైగా తనకు, అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడొద్దంటూ జగన్ కండీషన్ పెడుతున్నారు.

అయితే దీనికి షర్మిల కూడా కౌంటర్ గా లెటర్లు రాశారు. అసలు మా నాన్న బతికి ఉన్నప్పుడు ఆస్తుల పంపకాలే జరగలేదని చెబుతున్నారు. ఆయన చనిపోయిన తర్వాత తనకు ఇచ్చిన 200 కోట్లు కూడా తనకు వాటాల్లో భాగంగా డివిడెండ్ రూపంలో ఇచ్చినవే తప్ప జగన్ ప్రేమతో ఇచ్చినవి కాదన్నారు. తండ్రి చనిపోయిన తర్వాత జగన్ పార్టీ కోసం తన ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి కష్టపడ్డానని చెప్పారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చే వరకు బాగానే ఉన్నారని.. కానీ సీఎం అయ్యాక పూర్తిగా మారిపోయాడన్నారు.

సీఎం అయ్యాక నెల రోజులకే ఇజ్రాయెల్ పర్యటనలో విడిపోదామని చెప్పాడని.. చివరకు సాక్షి, భారతి సిమెంట్ లో 60 శాతం వాటా కావాలని జగన్ అన్న అడిగినట్టు తెలిపారు. చేసేది లేక చివరకు ఒప్పుకున్నట్టు ఆమె చెప్పారు. అలా జగన్ ఇచ్చిన మాట ప్రకారమే సాక్షిలో 40 శాతం, భారతి సిమెంట్స్ లో 40 శాతం, సరస్వతి పవర్ లో 100 శాతం, యలహంక ప్రాపర్టీలో 100 శాతం, వైఎస్ఆర్ నివసించిన ఇల్లు, ఇంకా కొన్ని ఆస్తులు తన భాగానికి వచ్చిందని షర్మిల తెలిపారు. భారతి సిమెంట్స్, యలహంక ప్రాపర్టీ అటాచ్ కాలేదు కాబట్టి అది వెంటనే రాసిస్తామని, మిగతా ఆస్తులు కేసులు పూర్తయ్యాక ఇస్తామని ఎమ్ వోయూ ఒప్పందం రాసిచ్చినట్టు తెలిపారు. అయినా సరే ఇప్పటి వరకు తనకు ఒక్క ఆస్తి కూడా ఇవ్వలేదని ఆరోపించారు.

తాము పదే పదే అడిగితే చివరకు ఓ కండీషన్ మీద ఒప్పందం చేసుకుందామని అన్నారు. జగన్ కు, అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడొద్దని ఆ ఒప్పందం సారాంశం. కానీ నేను దానికి ఒప్పుకోలేదు కాబట్టే ఆ ఒప్పందం జరగలేదు. సరస్వతి కంపెనీలో షేర్లు అసలు ఈడీ అటాచ్ మెంట్ లో లేవని.. కేవలం 32 కోట్ల విలువైన భూములు మాత్రమే ఈడీ అటాచ్ మెంట్ లో ఉన్నట్టు ఆమె చెబుతున్నారు. కాబట్టి తాము షేర్లు బదిలీకి జగన్ బెయిల్ రద్దుకు అసలు సంబంధమే లేదని షర్మిల వాదిస్తున్నారు. తాను జగన్ కు రాసిన లేఖ టీడీపీ పబ్లిష్ చేస్తే తనకు సంబంధం లేదంటున్నారు. చంద్రబాబు చేతిలో బాణం అవ్వాల్సిన అవసరం వైఎస్ బిడ్డకు లేదంటున్నారు. ఇలా ఆస్తుల వివాదంపై ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. జగన్ ఒకటి చెబుతుంటే.. షర్మిల మరొకటి చెబుతున్నారు. దీంతో జనాల్లో వీరిద్దరిపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు ఎవరు చెబుతున్నది నిజం.. ఎవరిది అబద్ధం అనేది తెలియక ఏపీ ప్రజల్లో ఇద్దరిపై అనేక అనుమానాలు మొదలయ్యాయి.

ఈ ఆస్తుల వివాదంలో ఇటు ప్రజలకు, అటు వైసీపీకి గానీ, ప్రతిపక్షాలకు గానీ ఉన్న అనుమానాలు ఏంటో చూద్దాం.

ముందు షర్మిలకు కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు ఏపీ ప్రజలు.

ఎమ్ వోయూ 2019లో ఒప్పందం చేస్తే.. ఇన్ని రోజులు ఎందుకు ఆగారు.. 2024 లో ట్రాన్స్ ఫర్ చేయించుకోవాల్సిన అవసరం ఏంటి..? అప్పుడే చేయించుకోవచ్చు కదా అంటున్నారు.

మీ అన్నకు రాసిన లెటర్ టీడీపీ ప్రధాన సోషల్ మీడియాలో రావడం ఏంటి..? రాజకీయం చేయడం కోసం టీడీపీ వెబ్ సైట్ లో రిలీజ్ చేశారా..? మీకు తెలియకుండానే టీడీపీ చేతుల్లోకి వెళ్తుందా..?

మీ నాన్న ఉన్నప్పుడు సంపాదించిన ప్రతి ఆస్తిలోనూ వాటా కావాలనుకుంటున్నారు.. మరి ఈ ఆస్తుల కోసం జైలుకు జగన్ వెళ్లినప్పుడు.. జైలుకు వెళ్లిన దాంట్లో మీకు వాటా ఉండొద్దా.. మీ మీదెందుకు కేసులు లేవు..?

మీ అన్న బెయిల్ రద్దు చేయడానికి మీరు కుట్రలు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది.. దానికి మీరేం సమాధానం చెప్తారు..?

జగన్ కు కూడా కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు..

జగన్ సీఎం అయ్యాక 2019లో అధికారంలోకి రాగానే చెల్లెలికి ఆస్తులు పంచేసి వదిలించుకోవాలని చూశారా.. విడిపోవాలి అనుకుంటే అంతకు ముందే ఎందుకు విడిపోలేదు..?

షర్మిల వైసీపీ కోసం అంత కష్టప్పుడు ఓ ఎంపీ పదవో, రాజ్యసభ పదవో కోరుకుంటే ఆమెకు ఎందుకు ఇవ్వలేదు..? ఎవరెవరికో పదవులు ఇస్తే.. ఈ రోజు వాళ్లు మీ వెంట ఉన్నారా.. ఒకవేళ షర్మిలకు ఇచ్చి ఉంటే మీ వెంటే మీకు బలంగా ఉండేది కదా..?

వైఎస్ వివేకా హత్య కేసు మీ రాజకీయ జీవితాన్నే నాశనం చేస్తుంది కదా.. అలాంటప్పుడు వైఎస్ అవినాష్ కు వ్యతిరేకంగా మాట్లాడొద్దని ఎందుకు అంటున్నారు..? ఇలా చేస్తే మీ మీదనే చెడుగా ప్రచారం జరుగుతుంది కదా..?

సొంత చెల్లికి, తల్లికి రాసిచ్చిన ఆస్తిని అమ్మొద్దని కోరుకోవచ్చు గానీ.. రాజకీయం కోసం మీ ఆస్తులను మీరు వెనక్కు తీసుకోవడం ఎంత వరకు కరెక్టు.. రాజకీయాలకు వ్యక్తిగత సంబంధాలకు ముడిపెట్టడం సమంజసమేనా..?

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News