Healthy Lifestyle Habits: ఈ మూడు అలవాట్లు మీకుంటే.. వందేళ్లు జీవిస్తారు!

Qubetvnews - May 21, 2026 / 09:42 PM IST

Healthy Lifestyle Habits: ఈ మూడు అలవాట్లు మీకుంటే.. వందేళ్లు జీవిస్తారు!

Healthy Lifestyle Habits: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడైన ప్రాక్టీసింగ్ డాక్టర్‌గా గిన్నిస్ రికార్డ్ సృష్టించిన 103 ఏళ్ల డాక్టర్ హోవార్డ్ టక్కర్ జీవితం మనందరికీ ఒక రోల్ మోడల్. వందేళ్లు దాటినా కూడా ఆయన ఎంతో ఉత్సాహంగా, ఆరోగ్యంగా జీవిస్తూ తన వృత్తిని కొనసాగిస్తున్నారు. సుదీర్ఘమైన, సంతోషకరమైన జీవితం కోసం ఆయన ముఖ్యంగా మూడు అద్భుతమైన అలవాట్లను పాటించాలని సూచిస్తున్నారు. ఈ అలవాట్లు పాటిస్తే దీర్ఘాయిస్సు కూడా ఉంటుందని చెబుతున్నాడు. ఇంతకీ ఆ మూడు అలవాట్లు ఏంటంటే?

1. మెదడుకు పదును – నిరంతర అభ్యాసం:
మనం శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎప్పుడూ చురుగ్గా ఉండాలని డాక్టర్ టక్కర్ బలంగా నమ్ముతారు. వయసు పెరిగేకొద్దీ చాలామంది ఆలోచించడం, కొత్త విషయాలు నేర్చుకోవడం తగ్గించేస్తుంటారు. కానీ, మైండ్‌ను ఎప్పుడూ బిజీగా ఉంచడం వల్ల మెదడు కణాలు చురుగ్గా పనిచేస్తాయి. దీనికోసం ప్రతిరోజూ పుస్తకాలు చదవడం, కొత్త నైపుణ్యాలు (స్కిల్స్) నేర్చుకోవడం, విభిన్నమైన యాక్టివిటీస్‌లో పాల్గొనడం వంటివి చేయాలి. రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ఏదో ఒక పనిలో నిమగ్నమవ్వడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గకుండా ఉంటుందని, మెదడుకు ఎప్పుడూ పని పెట్టడమే దీర్ఘాయుష్షుకు మొదటి రహస్యమని ఆయన చెబుతారు.

2. నెగెటివిటీకి దూరం – ఒత్తిడి లేని మనసు
మానసిక ప్రశాంతత శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కోపం, ద్వేషం, అసూయ, అసంతృప్తి వంటి ప్రతికూల భావాలు మనిషిని లోలోపల కుంగదీస్తాయి. ఈ నెగెటివిటీ వల్ల శరీరంలో హానికరమైన హార్మోన్లు విడుదలై తీవ్రమైన మానసిక ఒత్తిడి (స్ట్రెస్) పెరుగుతుంది. ఈ ఒత్తిడే అనేక జబ్బులకు మూలకారణం అవుతుంది. అందుకే ఎవరిపైనా పగ, ద్వేషాలను మనసులో మోయకూడదని డాక్టర్ టక్కర్ సూచిస్తున్నారు. గతాన్ని వదిలేసి, క్షమించే గుణాన్ని అలవర్చుకుని ప్రశాంతంగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది, జీవితం సంతోషంగా సాగుతుంది.

3. మితమే హితం – నియంత్రణతో కూడిన జీవనం
జీవితాన్ని ఆస్వాదించడం అంటే హద్దులు మీరడం కాదు. ప్రతి విషయంలోనూ ఒక పరిమితిని పాటించడం. తినే ఆహారం, పాటించే లైఫ్ స్టైల్, మన కోరికలు.. ఇలా ఏవైనా సరే ‘అతి’ కాకుండా చూసుకోవాలి. నచ్చిన ఆహారాన్ని తినవచ్చు, కానీ అది అమితంగా ఉండకూడదు. అదేవిధంగా భౌతిక సుఖాల కోసమో, మితిమీరిన కోరికల కోసమో పరుగులు పెట్టకుండా, ఉన్నదానితో తృప్తి చెందుతూ లిమిట్స్ పాటించాలి. నియంత్రణతో కూడిన ఈ జీవన శైలి శరీరాన్ని ఫిట్‌గా ఉంచడమే కాకుండా, జీవితంలోని ప్రతి క్షణాన్ని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసేలా చేస్తుందని ఈ శతాధిక వృద్ధ డాక్టర్ అనుభవపూర్వకంగా సలహా ఇస్తున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Tags