Rajyasabha bypolls : ఏపీలో రాజ్యసభ పదవుల జోరు.. చింతకాయల విజయ్ కు ఖాయమేనా..?
Qubetvnews - November 28, 2024 / 09:11 AM IST
Rajya-sabha bypolls : ఏపీలో రాజ్యసభ ఎన్నికలు రాబోతున్నాయి. వైసీపీ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకట రమణ, ఆర్.కృష్ణయ్య రాజీనామా చేసిన సంగతి తెలిసిందే కదా. ఇందులో రెండు స్థానాలకు నాలుగేళ్ల పదవి ఉంది. ఒక స్థానానికి మాత్రం రెండేళ్ల పదవి కాలం ఉంది. దీంతో ఈ మూడు స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో కూటమి నుంచి పదవులు ఆశిస్తున్న వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీలో ఎవరు పదవులు ఎగరేసుకుపోతారో అని అందరూ ఎదరు చూస్తున్నారు.
ఈ పదవులు పొందాలంటే 25 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. కూటమికి ప్రస్తుతం 164 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. కాబట్టి పదవులు అన్నీ కూటమి ఖాతాలోకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్ రావు పదవులకు ఇంకో నాలుగేళ్ల కాలం ఉంది. కానీ వెంకటరమణ పదవి మాత్రం ఇంకో రెండేళ్లు ఉండే అవకాశం ఉంది. వైసీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నందున పోటీలో ఉండే అవకాశమే లేదు. కూటమిలో ఉన్న బీజేపీకి ఇప్పటికే ఆరు ఎంపీ సీట్లు ఇచ్చారు. కాబట్టి రాజ్యసభ సీట్లు మాత్రం టీడీపీ, జనసేన పంచుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు లేదంటే కాకినాడ నుంచి ఎంపీ టికెట్ ఆశించిన సానా సతీష్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక టీడీపీ నుంచి చాలా మంది లిస్టులో ఉన్నారు. అయితే రాజ్యసభకు కచ్చితంగా యువకులనే పంపాలనే ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. రాబోయేది లోకేష్ నాయకత్వం కాబట్టి.. ఆయన కోసం యువకులను కేంద్రంలో ఉంచాలనేది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. ఇందులో భాగంగా రాజ్యసభ పదవీకాలం ముగిసిన సీనియర్ నేత కనకమేడల రవీంద్రకుమార్ ను మరోసారి పంపించే అవకాశం ఉంది. ఆయనతో పాటు యనమల రామకృష్ణుడి పేరు కూడా పరిశీలనలో ఉంది.
ఇక చంద్రబాబు స్వయంగా హామీ ఇచ్చిన చింతకాయల విజయ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. యువకుడు, మంచి సబ్జెక్టు ఉన్నందున ఆయన అయితేనే బెటర్ అని ఆలోచిస్తున్నారంట. మిగతా వారికి ఇప్పటికే చాలా సార్లు అవకాశాలు ఇచ్చారు కాబట్టి.. ఈ సారి విజయ్ కు ఇస్తే.. నమ్మకాన్ని నిలబెట్టుకున్న వాళ్లం అవుతామని చంద్రబాబు ఆలోచిస్తున్నారంట. విజయ్ కూడా పార్టీ కోసం చాలానే కష్టపడుతున్నాడు. రెండు పదవులు టీడీపీ ఖాతాలోకి వెళ్తే.. ఒకరిని సీనియర్ లిస్టులో, మరొకరిని యువకుల లిస్టులో తీసుకోవాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారంట. ఆ లెక్కన యువకుల కోటాలో విజయ్ కు పదవి ఖాయం అంటున్నారు.





