Revanth Reddy : బీసీ నేతకు టీపీసీసీ చీఫ్‌.. రేవంత్ వ్యూహం అదే..!

Qubetvnews - July 3, 2024 / 08:04 PM IST

Revanth Reddy : బీసీ నేతకు టీపీసీసీ చీఫ్‌.. రేవంత్ వ్యూహం అదే..!

Revanth Reddy : కాంగ్రెస్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చరిత్రను చూసుకుంటే.. ఆ పార్టీని ఎప్పుడైనా సరే అగ్ర కులాలకు చెందిన వారే శాసించారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రులు అయింది కూడా ఎక్కువగా రెడ్డి కులానికి చెందిన వారే. ఆ పార్టీ అధ్యక్షులుగా చేసింది కూడా ఎక్కువగా రెడ్డి కులానికి చెందిన వారే. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పట్లో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే పాదయాత్ర చేసి సీఎం అయ్యారు. ఆయన సీఎం అయిన తర్వాత బీసీ నేత అయిన డీ శ్రీనివాస్ కు అప్పట్లో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు.

ఎందుకంటే బీసీల్లో పార్టీ మీద వ్యతిరేకత రావొద్దనే ఉద్దేశంతో పాటు.. వైఎస్ పార్టీలో తన మాటనే చెల్లుబాటు కావాలనే ఉద్దేశంతో తనకు ఎంతో నమ్మకస్తుడైన డి శ్రీనివాస్ కు ఇచ్చారు. శ్రీనివాస్ కూడా వైఎస్ మాటను ఎన్నడూ దాటేయలేదు. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్‌ గా ఉన్నప్పుడే సీఎం అయ్యారు. ఆయన పదవి కాలం ముగుస్తుండటంతో పార్టీ పగ్గాలు ఎవరికిస్తారనే ఆసక్తి అందరిలోనూ ఉండేది. మళ్లీ రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తికే ఇస్తారనే ప్రచారం మొదట్లో జరిగింది. కానీ అనూహ్యంగా మహేశ్ కుమార్ గౌడ్ కు పార్టీ పగ్గాలు ఇవ్వబోతున్నారు.

తెలంగాణ బీసీల్లో బలమైన సామాజికవర్గాలు నాలుగు ఒకటి మున్నూరు కాపు. రెండు గౌడ, మూడోది యాదవ్. నాలుగోది ముదిరాజ్. ఇందులో మున్నూరు కాపులు, యాదవ కులస్తులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి దూరంగానే ఉన్నారు. ఇక వారి తర్వాత ప్రాధాన్యత కలిగిన గౌడ సామాజిక వర్గానికి ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. సీఎం పదవి రెడ్డి వర్గానికి ఇచ్చి.. మళ్లీ పార్టీ పగ్గాలు కూడా అగ్ర కులానికి ఇస్తే బీసీల నుంచి తీవ్రమైన విమర్శలు వస్తాయనే విషయాన్ని రేవంత్ రెడ్డి గ్రహించారు. అందుకే పార్టీలో కూడా తన మాట చెల్లుబాటు అయ్యే విధంగా మహేశ్ కుమార్ గౌడ్ ను తెరమీదకు తెచ్చినట్టు తెలుస్తోంది.

మహేశ్ కుమార్ గౌడ్ మొదటి నుంచి రేవంత్ కు అత్యంత సన్నిహితుడిగానే ఉన్నారు. పైగా పార్టీలో పెద్దగా వివాదాలు లేని వ్యక్తి. అటు బీసీలకు పార్టీ పగ్గాలు ఇచ్చామని చెప్పుకోవడంతో పాటు.. ఇటు తన మాట చెల్లుబాటు అయ్యే విధంగా చూసుకోవాలన్నదే రేవంత్ ఉద్దేశంగా తెలుస్తోంది.

అందుకే ఇలా మహేశ్ కుమార్ గౌడ్ ను తెరమీదకు తెచ్చినట్టు సమాచారం. త్వరలో బీజేపీ కూడీ బీసీ నేత అయిన ఈటల రాజేందర్ కు అధ్యక్ష బాధ్యతలు ఇవ్వబోతున్న తరుణంలో అంతకంటే ముందే బీసీ నేతకు కాంగ్రెస్ పదవి ఇచ్చి వారిని ప్రసన్నం చేసుకోవడంలో భాగం అవ్వాలని చూస్తోందన్నమాట.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News