AP : ఏపీలో ఎన్నికలు ఎప్పుడంటే.. ప్రభుత్వ అభిప్రాయం అదే..

Qubetvnews - February 17, 2024 / 07:08 AM IST

AP : ఏపీలో ఎన్నికలు ఎప్పుడంటే.. ప్రభుత్వ అభిప్రాయం అదే..

AP :

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడనే చర్చ వాడీవేడిగా సాగుతుంది. ఈసారి 15 రోజుల ముందే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ఈ మధ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇప్పటి నుంచే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినట్లుగా భావించి పనిచేయాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆయన సూచించారు. వైఎస్ జగన్ చేసిన ఈ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాలన్నీ అలర్ట్ అయ్యాయి. 15 రోజులు ముందే ఎన్నికలు వస్తాయని సాక్షాత్తూ ముఖ్యమంత్రే చెప్పడంతో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఏపీలో ఎన్నికలు ఏ నెలలో ఉంటాయనే చర్చ మొదలైంది.

ఏపీ ఎన్నికలు ఎప్పటిలాగే లోక్‌సభ ఎన్నికలతో పాటు జరుగుతాయనేది మాత్రం ఇప్పటికే స్పష్టమైంది. వైఎస్ జగన్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే పరిస్థితి అయితే ఏమాత్రం లేదు. ఒకవేళ.. ముందుగానే ప్రభుత్వాన్ని రద్దు చేసినా.. ఎన్నికలకు ఆర్నెళ్ల కంటే తక్కువే గడువు ఉంది కాబట్టి ఎప్పటిలాగే నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారనేది సుస్పష్టం. పోయిన సారి సార్వత్రిక ఎన్నికలకు 2019 మార్చి 18న నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 7 విడతల్లో పోలింగ్ జరిగింది. ఏపీతో పాటు కొన్ని రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు పోలింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి విడతలోనే ఏప్రిల్ 11న పోలింగ్ జరిగింది. దేశంలో అన్ని దశల పోలింగ్ పూర్తైన తర్వాత మే 23న ఫలితాలను విడుదల చేశారు.

ఇది ఇలా ఉంటే.. ఈ సారి మార్చిలో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువ‌డ‌నుంది. ఏప్రిల్‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఎన్నిక‌ల నిర్వహణ పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప‌లు ద‌ఫాలు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో చ‌ర్చించింది. ఎన్నిక‌ల తేదీల‌పై ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. ఈ నేప‌థ్యంలో ఏప్రిల్ 16 లేదా 18తేదీల‌ను ప్రభుత్వం సూచించిన‌ట్టు తెలుస్తోంది. ఈ తేదీలే కాకుండా ఉగాదికి ముందు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వ యంత్రాంగం సూచించినట్లు సమాచారం.

ఏప్రిల్ 9న ఉగాది పండుగను ప్రజలు జ‌రుపుకోనున్నారు. ఈ పండుగ తెలుగు వారికి ఎంత ప్రత్యేకమో చెప్పాల్సిన పనిలేదు. జ‌నం ఉగాది మూడ్‌లో ఉన్నప్పుడు కాకుండా పండుగ ముందు లేదా తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఏపీలో అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు కంప్లీట్ అయ్యాయి. ఇక లోక్‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి వుంది. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువ‌డ‌నున్న నేప‌థ్యంలో అధికారుల బ‌దిలీలు, ప‌నుల‌కు సంబంధించి క‌స‌ర‌త్తును ప్రభుత్వం వేగవంతం చేసేసింది.

ఇటు అధికార పార్టీ నేతలు కూడా వీలైన మేర‌కు పెండింగ్ ప‌నులు పూర్తి చేయ‌డానికి ప‌రుగులు తీస్తున్నారు. ఇటు ప్రభుత్వ పెద్దలు, అటు ఉన్న‌తాధికారుల వ‌ద్దకు వెళ్లి సిఫార్సులు చేయించుకోవ‌డంలో పార్టీ నేతలు నిమగ్నమయ్యారు. అలాగే పెండింగ్ బిల్లుల కోసం కాంట్రాక్టర్లు సైతం ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎవరి నోట విన్నా ఎన్నికలు ఎప్పుడున్న మాటే.

Read Today's Latest Andhra Pradesh in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News