Kcr : నిరుద్యోగులకు చేరువయ్యేలా కేసీఆర్ ప్లాన్.. బీఆర్ ఎస్ నిరసనలు అందుకే..!
Qubetvnews - July 6, 2024 / 08:25 PM IST
Kcr : కేసీఆర్ ఏం చేసినా దాని వెనకాల చాలా పెద్ద లోతైన వ్యూహం ఉంటుందని అంటుంటారు. ఆయన వేసిన వ్యూహం ఫలితం వెంటనే కనిపించకపోయినా.. భవిష్యత్ లో మాత్రం దాని ఫలితం కచ్చితంగా కనిపిస్తుందని చెబుతుంటారు. ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టాలంటే.. అస్త్రాలను రెడీ చేసుకోవడంలో కేసీఆర్ దిట్ట. తనకు అవసరం అనుకుంటే.. ఎవరినైనా తనవైపుకు లాగేసుకుంటారు. లేదంటే ఆయనే స్వయంగా వెళ్లి అవతలి వారి వైపు నిలబడుతుంటారు. ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండికూడా ఇలాంటి వ్యూహాలను రచిస్తున్నారు.
ఇప్పుడు బీఆర్ ఎస్ మీద వస్తున్న ఆరోపణలను, విమర్శలను తిప్పి కొట్టడం కాదు.. కాంగ్రెస్ మీద దెబ్బ కొట్టే ప్రయత్నాలను మొదలు పెట్టారు. అందుకే ఏ వర్గం అయితే కాంగ్రెస్ మీద త్వరగా ప్రభావం చూపించగలదో ఆ వర్గానికి ఇప్పుడు మద్దతు పలుకుతున్నారు. వారే నిరుద్యోగులు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇంకా కూడా నోటిఫికేషన్లు వేయలేదనే ఆగ్రహం నిరుద్యోగుల్లో ఉంది. అందుకే ఇప్పుడు వారంతా ఏకంగా మొన్న టీజీపీఎస్సీని ముట్టడించారు. నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు అయిన మోతీలాల్ కు బీఆర్ ఎస్ మొన్న మద్దతు పలికింది.
అంతే కాకుండా నిరుద్యోగ జేఏసీ తలపెట్టిన ముట్టడికి బీఆర్ ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాదు.. ఆ ముట్టడిలో భాగంగా అరెస్ట్ అయిన వారందరికీ బీఆర్ ఎస్ స్వయంగా బెయిల్ ఇప్పిస్తోందని తెలుస్తోంది. వారి తరఫున ఇప్పటికే కేటీఆర్ స్వయంగా వాయిస్ వినిపిస్తున్నారు. అంతే కాకుండా నిరుద్యోగులపై పోలీసుల దాడిని ఖండిస్తూ శనివారం రోజున బీఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపింది. అన్ని మండలాలు, జిల్లాల్లో భారీ ఎత్తున నిరసనలు తెలుపుతోంది బీఆర్ ఎస్ పార్టీ. వాస్తవంగా ఈ పదేండ్లలో బీఆర్ ఎస్ కు నిరుద్యోగులకు చాలా గ్యాప్ ఉంది.
వారిలో ఆగ్రహమే బీఆర్ ఎస్ ఓటమికి ప్రధాన కారణం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యువత తలచుకుంటే ఏదైనా చేయగలదనే విషయం కేసీఆర్ కు, కేటీఆర్ కు బాగా తెలుసు. అందుకే ఇప్పుడు నిరుద్యోగ అస్త్రాన్ని రేవంత్ రెడ్డి సర్కారు మీద ప్రయోగించబోతున్నారు కేసీఆర్.
ఇందులో భాగంగా ఇక ముందు కూడా భారీగా నిరసనలు తెలపాలని.. నిరుద్యోగుల తరఫున పోరాడాలని కేసీఆర్ ఇప్పటికే కేటీఆర్ కు సూచించారంట. అందుకే కేటీఆర్ కూడా ఇప్పుడు పదే పదే నిరుద్యోగుల సమస్యలపై మాట్లాడుతున్నారు. మరి వారి ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.


