Kcr : కేసీఆర్ ఆ పని చేస్తేనే బీఆర్ ఎస్ కు కలిసొస్తుందా..?
Qubetvnews - March 11, 2024 / 09:27 AM IST
Kcr : కేసీఆర్ అంటే రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరున్న వ్యక్తి. ఆయన వ్యూహాలు పన్నడంలో దిట్ట. అవసరాన్ని బట్టి ఒక్కో పార్టీని హైలెట్ చేస్తూ ట్రెండ్ క్రియేట్ చేస్తుంటారు. గత పదేండ్లుగా తెలంగాణ ఆయన ట్రెండ్ క్రియేట్ చేస్తే ప్రతిపక్షాలు ఆ ట్రెండ్ లోనే నడిచాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మొన్నటి వరకు తనకు తిరుగులేదు అనుకున్న కేసీఆర్ కు ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. కూతురు లిక్కర్ కేసులో ఇరుక్కోవడంతోనే కేసీఆర్ కు తిప్పలు మొదలయ్యాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడం కూడా తీవ్రంగా దెబ్బ కొట్టింది.
అప్పటి నుంచి కేసీఆర్ తనకు దూరం అవుతున్న వర్గాలను దగ్గరకు చేరుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పేరు చెప్పుకుండా కేసీఆర్ కేవలం కాంగ్రెస్ ను మాత్రమే విమర్శించారు. దాన్ని కాంగ్రెస్ క్యాష్ చేసుకుంది. బీజేపీ, బీఆర్ ఎస్ ఒక్కటే అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కేసీఆర్ మౌనంగా ఉండటమే ఇందుకు కారణం అని చెప్పుకొచ్చింది. దాన్ని ప్రజలు కూడా బాగానే నమ్మారు. కవితను లిక్కర్ కేసులో కాపాడుకోవడం కోసమే కేసీఆర్ బీజేపీని తిట్టట్లేదని ప్రజల్లోకి ఓ ప్రచారం బలంగా వెళ్లింది.
దాంతో అది అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద దెబ్బ కొట్టింది. కాగా అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే లిక్కర్ కేసులో కవితను నిందితురాలిగా చేర్చింది సీబీఐ. కాబట్టి ఇది బీజేపీకి బీఆర్ ఎస్ కు పొత్తు లేదని చెప్పుకునే అంశం. తమను బీజేపీ టార్గెట్ చేస్తోందని కేసీఆర్ చెప్పుకోవడానికి ఇది అతిపెద్ద అవకాశం. కాబట్టి తమకు బీజేపీకి ఎలాంటి పొత్తు లేదని చెప్పుకోవచ్చు. అంతే కాకుండా కాంగ్రెస్ కు దళితుల ఓట్లు పడకుండా బీఎస్పీతో పొత్తులు పెట్టుకున్నారు కేసీఆర్. కాబట్టి ఈ ఎన్నికల్లో కేసీఆర్ బీజేపీని, కాంగ్రెస్ ను కలిపి విమర్శించాల్సిన అవసరం ఉంది.
లేకపోతే మాత్రం కాంగ్రెస్ మళ్లీ అదే ప్రచారాన్ని తెరమీదకు తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. అసలే బీజేపీ ఎంపీ ఎన్నికల్లో చాలా ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బీజేపీని టార్గెట్ చేస్తేనే బీఆర్ ఎస్ కు పడే ఓటు బ్యాంకు పదిలంగా ఉంటుంది. లేదంటే మాత్రం అది కాంగ్రెస్ కు మళ్లే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు.
రాబోయే ఎన్నికల్లో బలంగా ప్రచారం చేయడానికి కేసీఆర్ కు ఇప్పుడు మంచి అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా ఈ ఎన్నికల్లో కేసీఆర్ మాత్రం కచ్చితంగా బీజేపీని ఘాటుగా విమర్శలు గుప్పిస్తేనే ఆయనకు రాజకీయంగా లబ్ది జరుగుతుంది. చూడాలి మరి ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఏం చేస్తారో.




