Game Changer Review: గేమ్ ఛేంజర్ మూవీ రివ్యూ.. హిట్టా లేక ఫట్టా..?

Qubetvnews - January 10, 2025 / 09:29 AM IST

Game Changer Review: గేమ్ ఛేంజర్ మూవీ రివ్యూ.. హిట్టా లేక ఫట్టా..?

Game Changer Review: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వచ్చిన మూవీ గేమ్ ఛేంజర్. రామ్ చరణ్‌ చాలా కాలం తర్వాత సోలోగా చేస్తున్న మూవీ కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. కానీ ఎందుకో శంకర్ తో సినిమా చేస్తే ఏ స్థాయిలో హైప్ వస్తుందో ఆ రేంజ్ లో అయితే రావట్లేదు. ఈ విషయాన్ని దిల్ రాజు కూడా రిలీజ్ కు ముందే చెప్పుకుని బాధపడ్డాడు. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్ తో తీశారు. తాను భారీగా ఖర్చు పెట్టానని ప్రతి ప్రెస్ మీట్ లో చెప్పుకున్నాడు దిల్ రాజు. పెద్ద ఎత్తున ప్రమోషన్లు కూడా చేశారు. పవన్ కల్యాణ్‌ కూడా వచ్చి సపోర్టు చేశాడు. ఇక నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ ఏంటంటే..?

ఫైర్ మీద ఉండే ఓ కాలేజీ కుర్రాడు నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్ గా ఎలా మారాడు.. ఆ తర్వాత అతను ఎలాంటి సమస్యలను ఎదుర్కున్నాడు అనేది సినిమా స్టోరీ. రామ్ నందన్ చదువుకున్నప్పటి నుంచే వ్యవస్థలోని లోపాలను ప్రశ్నిస్తుంటాడు. పట్టుబట్టి ఐఏఎస్ ఆఫీసర్ గా మారి విశాఖపట్నంకు వస్తాడు. అయితే ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సత్యమూర్తి (శ్రీకాంత్) కొడుకు, మంత్రి బొబ్బిలి మోపిదేవి (sj సూర్య)తో రామ్ నందన్ కు గొడవలు వస్తాయి. ప్రతి సారి మోపిదేవి అవినీతిని ప్రశ్నించడంతో ఇద్దరికీ శత్రుత్వం ఏర్పడుతుంది. అనుకోకుండా సీఎం సత్యమూర్తి చనిపోతాడు. దాంతో తానే సీఎం కావాలని మోపిదేవి ప్లాన్ వేస్తాడు. ఇంతలోనే ఎన్నికలు కూడా వస్తాయి. ఎలాగైనా మోపిదేవిని సీఎం కాకుండా అడ్డుకోవడానికి రామ్ నందన్ పోరాడుతాడు. అప్పుడే తన తండ్రి అప్పన్న గురించి, అమ్మ గురించి తెలుసుకుంటాడు. వారి ఆశయాల కోసం పోరాడాలనుకుంటాడు. మరి మోపిదేవిని సీఎం కాకుండా రామ్ నందన్ ఎలా అడ్డుకున్నాడు, అతని జీవితంలోకి దీపిక(కియారా అద్వానీ) ఎలా వచ్చింది.. చివరకు ఏం జరిగింది అనేది మిగతా కథ.

ఎవరెలా చేశారంటే..?

రామ్ చరణ్‌ ఇందులో రెండు పాత్రల్లో కనిపించాడు. ఒకటి అప్పన్న, రెండోది రామ్ నందన్. కానీ ఇందులో రామ్ చరణ్‌ యాక్టింగ్ ఎందుకో అనుకున్నంత హైప్ లో లేదు. సినిమా రిలీజ్ కు ముందు రామ్ చరణ్‌ యాక్టింగ్ అద్భుతం అన్నట్టు హైప్ ఇచ్చారు. కానీ ఆ స్థాయిలో అనిపించలేదు. చాలా సీన్లలో రామ్ చరణ్‌ ఏదో సాదాసీదా సినిమాల్లో కనిపించినట్టే అనిపిస్తాడు. పైగా అతని లుక్స్ కూడా శంకర్ సినిమా రేంజ్ లో లేవు. సాధారణంగా శంకర్ సినిమాలో హీరో లుక్స్ కు బాగా మార్కులు పడుతాయి. కానీ ఇందులో రామ్ చరణ్‌ ఆ స్థాయిలో కనిపించలేదు. చివరకు అప్పన్న పాత్రలో కూడా అలాగే ఉన్నాడు. అప్పన్న పాత్రకు తగ్గ లుక్స్ ను మెయింటేన్ చేయలేదేమో అనిపిస్తుంది. భారీ మాస్ డైలాగులు కూడా లేవు. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా చెప్పుకోదగ్గ మాస్ యాక్షన్ సీన్లు లేవనే అసంతృప్తి ప్రేక్షకుల్లో ఉండిపోతుంది. ఎస్ జే సూర్య తన పాత్రకు తగ్గట్టు నటించాడు. శ్రీకాంత్, అంజలి, కియారా తమ పాత్రలకు తగ్గట్టు నటించారు.

ఎలా ఉందంటే..?

గేమ్ ఛేంజర్ మూవీ ఒక రొటీన్ పొలిటికల్ డ్రామా. గతంలో కూడా ఇలాంటి పొలిటికల్ డ్రామాలు చాలానే వచ్చాయి. ఒక ఐఏఎస్ అధికారికి పొలిటికల్ లీడర్ కు గొడవల నేపథ్యంలో వచ్చిన సినిమాలో కోకొల్లలు. కానీ ఎవరెలా చూపించారు అనే దానిపైనే మూవీ హిట్టా ఫట్టా అనేది తేలిపోతుంది. మరి శంకర్ సినిమా కాబట్టి ఆ స్థాయిలో ఎక్స్ పెక్ట్ చేసినా.. సినిమాలో అది లేదనిపిస్తుంది. ఏదో రొటీన్ కథను అటు తిప్పి ఇటు తిప్పి తీసినట్టే అనిపిస్తుంది. చెప్పుకోదగ్గ ట్విస్టులు లేకపోవడం పెద్ద మైనస్. ముఖ్యంగా కథలో బలమైన లైన్ లేదు. ఏ కథకు అయినా బలం మలుపుతిప్పే లైన్. కానీ ఇందులో అది కొరవడినట్టు అనిపిస్తుంది. జనాల్లోకి దూసుకెళ్లే డైలాగులు కూడా లేవు. ఒక ఐఏఎస్ అధికారిగా చేస్తే.. ప్రేక్షకుల్లో చాలా అంచనాలు ఉంటాయి. కానీ ఆ స్థాయిలో సీన్లు ఇందులో లేవు. అవినీతిని బయటకు తీసే ఎలివేషన్ సీన్లు కూడా లేవు. రామ్ చరణ్‌ డైరెక్టర్ ను గుడ్డిగా నమ్మేసి చేసినట్టు సినిమా చూస్తేనే అర్థం అవుతుంది. శంకర్ తన మార్క్ ను ఈ సినిమాలో చూపించలేకపోయాడు. కథ ఆ స్థాయిలో లేనప్పుడు దాన్ని బెటర్ గా చూపిస్తేనే ప్రేక్షకులకు అంతో ఇంతో కనెక్ట్ అవుతుంది. కానీ శంకర్ మాత్రం ఆ విషయంలో వెనకబడ్డాడు. వింటేజ్ శంకర్ ఈజ్ బ్యాక్ అని ప్రమోట్ చేసినా.. సినిమా చూసిన వాళ్లకు మాత్రం అనిపించదు. మ్యూజిక్ బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్

రామ్ చరణ్‌, ఎస్ జే సూర్య నటన
కొన్ని యాక్షన్ సీన్లు

మైనస్ పాయింట్లు

బలహీనమైన కథ
రొటీన్ డైలాగులు
పేవలమైన డైరెక్షన్

చివరగా..

గేమ్ ఛేంజర్ మీద ఈ స్థాయిలో హైప్ క్రియేట్ చేయకపోతే బాగుండేదేమో. ఎందుకంటే సినిమా యావరేజ్ గా ఉన్నప్పుడు హైప్ ను భారీగా క్రియేట్ చేస్తే ఎక్కువ నష్టం జరుగుతుంది. గేమ్ ఛేంజర్ విషయంలో కూడా అదే జరిగింది. శంకర్ మార్క్ లేకపోవడంతో గేమ్ లాస్ అయింది.

రేటింగ్ః2.25 5

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News