Chandrababu : ఆ రెండే చంద్రబాబు టార్గెట్.. పూర్తి చేస్తే చరిత్రే..
Qubetvnews - June 20, 2024 / 07:23 PM IST
Chandrababu : ఏపీకి రెండు అతిపెద్ద తీరని కోరికలు ఉన్నాయి. అందులో ఒకటి పోలవరం, రెండోది రాజధాని. ఏపీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి నుంచి పోలవరం ప్రాజెక్టు ఊరిస్తోంది. ఇదిగో.. అదిగో అంటూ వస్తున్నారే తప్ప పూర్తి కావట్లేదు. పాలకులకు పట్టింపు లేకనో.. అవినీతి కారణంగానో.. లేక ఇంకేదైనా కారణమో తెలియదు గానీ.. దాదాపు 15 ఏళ్లకు పైగా పోలవరం ప్రాజెక్టు ఇంకా పెండింగ్ లోనే ఉందంటే ఎలాంటి రాజకీయ పరిస్థితులతో చిక్కుముడి పడి ఉందో అర్థం చేసుకోవచ్చు. దాంతో పాటు గత పదేండ్లుగా ఏపీకి రాజధాని లేక చాలా పెద్ద సమస్యలు వస్తున్నాయి.
ఏపీ పేరు చెబితే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది మీ రాజధాని ఏది అనే మాట. కాబట్టి ఇప్పుడు ఏపీకి రాజధాని అనేది చాలా అవసరం. దీన్ని ఇప్పుడు చంద్రబాబు నిజం చేసి చూపిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. చంద్రబాబు గతంలో అమరావతిని రాజధానిగా ప్రకటించారు. అక్కడ ఆయన హయాంలో వేలకోట్ల పనులు కూడా జరిగాయని అంటారు. కానీ అది అనుకున్నంత స్థాయిలో జరగలేదు. గత ఐదేండ్లుగా అక్కడ పనులు పెద్దగా జరగలేదు. అయితే ఇప్పుడు చంద్రబాబు మరోసారి అమరావతి నినాదం ఎత్తుకుంటున్నారు.
ఏపీ రాజధాని అమరావతే అని అంటున్నారు. రాజధాని నిర్మిస్తానని శపథం చేస్తున్నారు. అలాగే పోలవరం కూడా పూర్తి చేస్తానంటున్నారు. ఏపీ అంటే.. ఏ అమరావతి.. పీ పోలవరం అనే స్లోగన్ కూడా ఇచ్చేస్తున్నారు. దాంతో ఇప్పుడు ఏపీకి పోలవరంతో పాటు రాజధాని కూడా వచ్చేస్తుందని టీడీపీ నేతలు, నాయకులు చెబుతున్నారు. ఇదే ఇప్పుడు చంద్రబాబు ముందు ఉన్న అతిపెద్ద సవాళ్లు. ఇందులో చంద్రబాబు గనక సక్సెస్ అయితే మాత్రం ఇక ఆయనకు తిరుగు ఉండదని చెప్పుకోవాలేమో. ఎందుకంటే ఏపీ చరిత్రలో నిలిచిపోయేవి ఈ రెండూ.
ఇందులో ఏ ఒక్కటి పూర్తి చేసినా.. ఏపీ చరిత్రలో చంద్రబాబుకు ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. దాంతో పాటు అమరావతిని రాజధానిగా నిలబెట్టగలిగితే.. ఇక ఆయన పేరు ఏపీ ఉన్నంత కాలం ప్రజలు గుర్తుంచుకుంటారు. కాబట్టి చంద్రబాబు ఈ రెండింటిని సాధిస్తారా.. లేదా అనేది ముందు ముందు వేచి చూడాలి.




