Brs : అప్పుడు కాంగ్రెస్.. ఇప్పుడు బీఆర్ ఎస్.. ఫిరాయింపులపై సేమ్ సీన్..!
Qubetvnews - July 17, 2024 / 03:07 PM IST
Brs : రాజకీయాల్లో అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. అందుకే అధికారంలో ఉన్నప్పుడు అతి చేయకూడదు. అధికారం ఐదేండ్లు మాత్రమే అని గుర్తు పెట్టుకుని భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తేనే భవిష్యత్ ఉంటుందని గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు బీఆర్ ఎస్ కు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. గత పదేండ్లు బీఆర్ ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ప్రతి చిన్న దాన్ని కూడా పెద్దదిగా చేసి నానా హైరానా చేశారు. కానీ తెలంగాణ ప్రజలు వారిని తిరస్కరించారు. మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడించారు. ఎంత తెలంగాణ తెచ్చిన క్రెడిట్ ఉన్న పార్టీ అయినా సరే ప్రజల ముందు ఓడిపోక తప్పలేదు.
అయితే బీఆర్ ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకేసారి 12 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్న ఘనత కూడా బీఆర్ ఎస్ కు ఉంది. అప్పుడు కాంగ్రెస్ నేతలు కూడా దాన్ని తీవ్రంగా ఖండించారు. తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించకుండా తీసుకోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఏకంగా గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. అయినా పెద్దగా చర్యలు తీసుకోలేదనుకోండి. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న పనులకు బీఆర్ ఎస్ కు కూడా అలాంటి పరిస్థితే వచ్చిందని చెప్పుకోవాలి.
ఇప్పుడు రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ వరుసగా బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలను లాగేసుకుంటోంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంది. మిగతా వారిని కూడా చేర్చుకుంటామని.. బీఆర్ ఎస్ ను జీరో చేస్తామని చెబుతున్నారు రేవంత్ రెడ్డి. ఇందుకు తగ్గట్టే మిగతా ఎమ్మెల్యేలతో కూడా చర్చలు జరుపుతున్నారు. దీంతో తమ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై కేటీఆర్ తో పాటు మిగతా కేసీఆర్ కుటుంబీకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ రోజు కేటీఆర్ స్వయంగా తమ ఎమ్మెల్యేలతో వెళ్లి స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఫిర్యాదు కూడా చేశారు.
తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై చర్యలు తీసుకోవాలని.. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరారు. ఇది చూస్తుంటే గతంలో కాంగ్రెస్ కూడా ఇలాగే స్పీకర్ ను కలిసి ఫిర్యాదు చేసిన సంఘటన గుర్తుకు వస్తోంది. అందుకే ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ ఎస్ ఒకే పరిస్థితిని ఎదుర్కున్నాయని చెప్పుకోవాలి.





