Vinesh Phogat : పడి లేచిన కెరటం.. వినేశ్ జీవితమే ఓ చరిత్ర..!
Qubetvnews - October 9, 2024 / 02:30 PM IST
Vinesh Phogat : 2024 ఆగస్టు 7.. ఈ రోజును ఇండియా ఎన్నటికీ మర్చిపోదు. ఎందుకంటే ఆ రోజు దేశం గుండె బద్దలైంది. ఇంకొక్క అడుగు వేస్తే ఒలంపిక్స్ లో ఇండియాకు స్వర్ణ పతకం వచ్చేది. కానీ 100 గ్రాముల బరువు భారతీయుల కలను తుడిచేసింది. ఆ బరువు వినేశ్ ఫొగట్ జీవితాన్ని తలకిందులు చేసేసింది. అది వినేశ్ జీవితంలో చీకటి రోజుగా మిగిలిపోయింది. కట్ చేస్తే సరిగ్గా రెండు నెలలకు ఆమె గెలిచి చూపించింది. దేశం మొత్తం తనకు సలామ్ అనేలా చేసి చూపించింది. అయితే ఈ సారి ఆమె గెలిచింది ఆటల్లో కాదు.. రాజకీయం అనే చదరంగంలో.
హర్యానాలోని బలాలి అనే చిన్న పల్లెటూరిలో వినేశ్ ఫొగట్ జన్మించింది. ఆమెది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తండ్రి బస్ డ్రైవర్. కానీ తన కూతురును మాత్రం విమానంలో ఎక్కి తిరిగే స్థాయిలో ఉండాలని కోరుకున్నాడు. ఆమె తండ్రి మాటలు విన్న ఆ పసి మనసు నవ్వి ఊరుకుంది. తన కూతురు తన మాటలను సరదాగా తీసుకుందేమో అనుకున్నాడు ఆ తండ్రి. కానీ ఆ పసి మనసులో తండ్రి కలను నెరవేర్చడానికి ప్రాణాలైనా అర్పించాలనే పట్టుదల పెరిగిందని అప్పుడు ఆయనకు తెలియదు. కానీ కూతురు విజయాన్ని చూడక ముందే ఆ తండ్రి కన్నుమూశాడు.
తండ్రి అండ లేకపోవడంతో ఆమె కల చెదిరిపోయింది. అన్నీ మానేసుకుంది. ఇంతలోనే తల్లికి క్యాన్సర్ వొచ్చింది. విధి ఆడుతున్న వింత నాటకంలో ఆమె నలిగిపోయింది. కానీ తల్లి నూరిపోసిన ధైర్యం ఆమెను బలంగా మార్చేసింది. బతకాలంటే పోరాడాలి అని తల్లి చెప్పిన మాటలు ఆమెను మళ్లీ తన లక్ష్యంవైపు నడిపించాయి. రెజ్లింగ్ అంటే అప్పటి వరకు ఇండియాలో పెద్దగా తెలియని రోజుల్లో.. ఆమె గెలిచి దాని గురించి దేశమంతా మాట్లాడుకునేలా చేసింది. ఎన్నో సార్లు ఒలపింక్స్ లో తన సత్తా చాటింది. 2016లో రియో ఒలంపిక్స్ క్వార్టర్స్ లో మోకాలి గాయంతో వెనుదిరిగింది.
ఆ సమయంలో ఆమె కండ్ల నిండా నీళ్లే. ఆ తర్వాత టోక్యోలో కూడా ఆమెకు ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. అయినా సరే మడపతిప్పని సివంగిలా ముందుకే కదిలింది. ఆటల్లోనే కాదు.. ఇటు తోటి రెజ్లర్స్ ను వేధించిన రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ పై రోడ్డెక్కి గొంతెత్తింది. ఢిల్లీ వేదికగా పోరాడింది. లాఠీ దెబ్బలు కూడా తినింది. కానీ ఆ పోరాటంలో గెలవలేకపోయింది. కానీ పారిస్ ఒలంపిక్స్ లో నెగ్గి తన వాయిస్ ను వినిపించాలనుకుంది. ఈ సారి ఏకంగా 53 కిలోల నుంచి 50 కిలోల పోటీల్లో పాల్గొంది.
అన్ని ఫార్మాట్లలో నెగ్గింది. ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని కసితీరా ఆడింది. చివరకు ఫైనల్ దాకా వచ్చింది. ఇండియా సరికొత్త చరిత్ర సృష్టించే సమయం దగ్గర పడిందని అంతా మురిసిపోయారు. ఆమె గెలిస్తే స్వర్ణం.. ఓడితే రజతం.. ఏది గెలిచినా ఓ చరిత్రే అయ్యేది. కానీ ఆమె బరువు ఆమెకు శాపంగా మారింది. అయినా సరే తెల్లారితే ఫైనల్స్ ఉంటాయని.. రాత్రంతా బరువును తగ్గించేందుకు సెకన్ కూడా రెస్ట్ తీసుకోకుండా పరుగెత్తింది. ఆవిరి స్నానాలు చేసింది. జుట్టు కత్తిరించుకుంది. ఒక్క చుక్క మంచినీళ్లు కూడా తీసుకోలేదు. 24 గంటల పాటు ఆహారం తీసుకోలేదు.
చివరకు తన రక్తం కూడా తీయించుకుంది. ఒక రకంగా చావు అంచుల దాకా వెళ్లి పోరాడింది. అయినా సరే ఒక్క 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందనే కారణంతో ఆమె ఒలంపిక్స్ నుంచే నిష్క్రమించాల్సి వచ్చింది. ఆ క్షణం ఆమె గుండె కరిగిపోయింది. అమ్మా క్షమించు.. నా మీద రెజ్లింగ్ గెలిచింది. నేను ఓడిపోయాను. ఇక నాకు పోరాడే శక్తి కూడా లేదు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలకు దేశం మొత్తం కంటతడి పెట్టింది. అంత గొప్ప పోరాట యోధురాలు ఆటల్లో గెలవకపోయినా.. భారత ప్రజల మనసులు మాత్రం గెలుచుకుంది.
కానీ ఆటలతోనే తన జీవితాన్ని ఆపేయాలని ఆమె అనుకోలేదు. సమాజంలో జరుగుతున్న అవినీతిపై పోరాడాలనుకుంది. అందుకే రాజకీయాల్లోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో చేరి.. హరియాణా ఎన్నికల్లో పోటీ చేసింది. జులానా నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తే.. ఆమె గురించి తెలిసిన ప్రజలు గుండెల్లో పెట్టుకుని మరీ గెలిపించుకున్నారు. హరియాణాలో కాంగ్రెస్ ఓడిపోయినా.. ఆమె గెలుపు మాత్రం ఇక్కడ అందరితో చప్పట్లు కొట్టించింది. బీజేపీ, కాంగ్రెస్ చెరో రాష్ట్రంలో గెలిచినా ప్రజలు వాటి గురించి మాట్లాడుకోవట్లేదు. కేవలం వినేశ్ ఫొగట్ గెలుపు గురించి మాత్రమే చర్చించుకుంటున్నారంటే.. ఆమె ప్రభావం దేశం మీద ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇంక నా వల్ల కాదు.. అలసిపోయా అనే ఆలోచన మనకు చాలా సందర్భాల్లో అనిపిస్తుంది.. అలాంటి సమయంలో వినేశ్ పోరాటాన్ని చూస్తే.. ఇంకొక్కసారి పోరాడుదాం అనిపించక మానదేమో.





