Kcr : కేసీఆర్ ఇంట్లో విషాదం.. కన్నీటి పర్యంతం అయిన మాజీ సీఎం..!
Qubetvnews - January 25, 2025 / 12:10 PM IST
Kcr : మాజీ సీఎం కేసీఆర్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరి చీటి సకలమ్మ(82) అనారోగ్యంతో కన్నుమూశారు. దాంతో కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబం, ఆయన సోదరీమణులు శోకసంద్రంలో మునిగిపోయారు. సకలమ్మ కొంత కాలంగా వయోభారంతో వచ్చిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దాంతో ఆమె కుమారులు హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. కొన్ని రోజులుగా అక్కడే చికిత్స తీసుకుంటున్న ఆమె శుక్రవారం రాత్రి చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత ఆస్పత్రికి చేరుకున్నారు. హైదరాబాద్ లోని ఆమె ఇంటికి మృతదేహాన్ని తరలించారు.
కేటీఆర్ దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చూసుకుంటున్నారు. ఇక సోదరి చనిపోవడంతో కేసీఆర్ ఈ రోజు ఉదయం ఆమె ఇంటికి చేరుకున్నారు. ఆమె మృతదేహానికి నివాళి అర్పించి కన్నీటి పర్యంతం అయ్యారు. కేసీఆర్ కు ఎనిమిది మంది సోదరీమణులు ఉండగా.. సకలమ్మ కేసీఆర్ కు ఐదో సోదరి. ఆమెది రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం పదిర గ్రామం. ఆమెకు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆమె కుమారులు కూడా బీఆర్ ఎస్ లోనే కీలకంగా పనిచేస్తున్నారు. సకలమ్మ భర్త కొంత కాలం క్రితమే చనిపోగా.. ఇప్పుడు ఆమె కూడా కన్నుమూశారు. ఈ రోజు ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.





