Konda Surekha : కొండా సురేఖపై సొంత ఎమ్మెల్యేల తిరుగుబాటు.. పార్టీకి నష్టం జరుగుతోందా..?
Qubetvnews - October 17, 2024 / 08:13 PM IST
Konda Surekha : రాజకీయాల్లో ఉన్నప్పుడు పది మందిని కలుపుకుని పోవాలి. పది మందిని మనకు బలంగా మార్చుకోవాలి. అంతే తప్ప.. మన వాళ్లతో కయ్యం పెట్టుకుని దూరం చేసుకోవద్దు. ఎందుకంటే బయటి వాళ్లతో గొడవలు అయినప్పుడు మన వాళ్లే అండగా ఉంటారు. మరి మనవాళ్లతోనే గొడవలు పెట్టుకుంటే.. అసలు ఎవరూ దేకరు. ఈ విషయం రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న కొండా సురేఖకు తెలియదా.. ఆమె చేస్తున్న పని ఇప్పుడు బయటి వారినే కాదు సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూడా చిరాకు పెడుతోంది. దాంతో వారంతా తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు.
కొండా సురేఖ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ అనే పేరు తెచ్చుకుంది. కానీ ఆమె దూకుడు కొన్ని సార్లు అందరికీ ఇబ్బందికరంగానే ఉంటుంది. అంతా నాదే నడవాలి అన్నట్టు ప్రవర్తిస్తుంది. మొన్నటికి మొన్న కేటీఆర్ ను తిట్టే పనిలో సమంత, నాగార్జున కుటంబంపై ఎంత దారుణమైన కామెంట్లు చేసిందో అందరం చూశాం. ఆమె వ్యాఖ్యలను అందరూ తీవ్రంగా ఖండించారు. కానీ ఆ విషయంలో అంతో ఇంతో పార్టీ ఆమెకు సపోర్టుగా ఉంది. అయితే ఇప్పుడు ఆమె ప్రవర్తనతో వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నారు. తమ నియోజకవర్గాల్లో తమను అణచివేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.
తమ నియోజకవర్గాల్లో తమకు తెలియకుండా కార్యక్రమాలు చేస్తోందని.. తమ ఇలాకాలో ఆమె పెత్తనాన్ని తట్టుకోలేకపోతున్నామంటూ వాపోతున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్విని రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, గండ్ర సత్యానారాయణ రావు, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ కలిసి హైదరాబాద్ లో దీపాదాస్ మున్షి, మహేశ్ కుమార్ గౌడ్ కు ఫిర్యాదు చేశారు. తమ ఇలాకాలో ఆమె ప్రోగ్రామ్ లు చేస్తూ.. తమకు కనీసం చెప్పట్లేదని.. ఫ్లెక్సీల్లో తమ ఫొటోలు కూడా వేయట్లేదంటూ వాళ్లు ఆరోపించారు.
దాంతో సురేఖ వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అన్నట్టు సీన్ మారిపోయింది. ఈ ఘటనతో ఇప్పటి వరకు కాంగ్రెస్ లో ఆమెకు సపోర్టుగా ఉన్న వారు కూడా ఆమెకు దూరంగా ఉంటున్నారంట. ఇప్పుడు సొంత పార్టీలోనే ఆమెకు వ్యతిరేక వర్గం తయారు కావడం.. అంతర్గత విభేదాల వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని చెబుతున్నారు.
సురేఖ వ్యవహార తీరుతో ఇప్పటికే ఆమెపై కోర్టుల్లో కేసులు కూడా నమోదవుతున్నాయి. అది చాలదన్నట్టు ఇలా సొంత ఎమ్మెల్యేలతో తగాడాలు పెట్టుకుంటే.. ఆమె రాజకీయ జీవితానికే ప్రమాదం అంటున్నారు. వరంగల్ జిల్లాలు ఆమె సీనియర్. అందరినీ కలుపుకుని పోతే ఆమెకే కొండంత బలం అంటున్నారు.





