KTR : రేవంత్ పై కేటీఆర్ ఆత్మగౌరవ విమర్శలు.. పని చేస్తాయా..?
Qubetvnews - March 7, 2024 / 09:33 AM IST
KTR : తెలంగాణ ఆత్మగౌరవం అనే నినాదాన్ని ఎప్పుడు ఎత్తుకున్నా సరే ఓ రేంజ్ లో దానికి రెస్పాన్స్ వస్తుంది. అందులో ఎలాంటి అనుమానాలు లేవు. గత పదేండ్లుగా బీఆర్ ఎస్ దాన్ని సక్సెస్ ఫుల్ గా వాడేసుకుంది. తెలంగాణ ఆత్మగౌరవం నినాదాన్ని వాడుకున్న ప్రతిసారి బీఆర్ ఎస్ కు కలిసి వచ్చింది. అంతెందుకు గతంలో 2018 ఎన్నికల్లో బీఆర్ ఎస్ ను గెలిపించింది అదే ఆత్మగౌరవం సెంటిమెంట్. కానీ ఎందుకో మొన్నటి ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఆత్మగౌరవం అనే మాటను ఎత్తుకోలేదు. కేవలం పదేండ్ల డెవలప్ మెంట్ ను చూపించి ఓట్లు అడిగింది. అదే కాంగ్రెస్ ను అధికారంలో కూర్చోబెట్టింది.
అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ ఎస్ మళ్లీ ఆత్మగౌరవ సెంటిమెంట్ ను ఎత్తుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా కేటీఆర్ మరోసారి రేవంత్ మీద ఆత్మగౌరవ సెంటిమెంట్ ను ప్రయోగించారు. మొన్న ప్రధాని మోడీ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి కాస్త పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. స్టేజి మీద మోడీపై ప్రశంసలు కురిపించారు. అంతే కాకుండా తనకు పెద్దన్న లాంటి వాడని చెప్పుకొచ్చారు. ఎయిర్ పోర్టుకు వెళ్లి సెండాఫ్ ఇచ్చి వచ్చారు. దాంతో ఇప్పుడు కేటీఆర్ ట్విట్టర్ సాక్షిగా రెచ్చిపోయారు. నరేంద్రమోడీ ముందు రేవంత్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టాడని ఆరోపించారు.
అంతే కాకుండా తెలంగాణ మోడల్ ముందు గుజరాత్ మోడల్ గొప్పగా కనిపిస్తోందా అంటూ విమర్శించారు. తెలంగాణకు ఎలాంటి నిధులు కేటాయించకుండా అన్యాయం చేస్తున్న కేంద్ర బీజేపీ, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని రేవంత్ రెడ్డి పొగడటం అంటే కచ్చితంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టడమే అన్నట్టు మాట్లాడారు కేటీఆర్. ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మొన్నటి వరకు బీజేపీని తిట్టి.. ఇప్పుడు నరేంద్ర మోడీ తన పక్కనే సీటు ఇవ్వడంతో ఎలా పొగుడుతారంటూ మండిపడుతున్నారు కేటీఆర్. ఇద్దరి మధ్య ఏదో లాపాయకారి ఒప్పందం ఉందంటూ ఆరోపిస్తున్నారు.
కేటీఆర్ ఇప్పుడు చేసిన విమర్శలు చూస్తుంటే మళ్లీ వారికి కలిసి వచ్చిన తెలంగాణ ఆత్మగౌరవ సెంటిమెంట్ ను ఎత్తుకోవడానికి రెడీ అయిపోయినట్టు తెలుస్తోంది. మొన్నటి వరకు అభివృద్ది జపం చేసిన బీఆర్ ఎస్.. అదొక్కటి ఉంటే సరిపోదని గ్రహించింది కాబోలు.. అందుకే ఇప్పుడు మళ్లీ ఆత్మగౌరవ సెంటిమెంట్ ను ఎత్తుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది.
ఇందులో భాగంగానే ఇప్పుడు కేటీఆర్ ఇలాంటి విమర్శలు చేశారని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ ఎస్ దీన్ని మరింత ఎక్కువగా వినిపించే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఏదేమైనా బీఆర్ ఎస్ వేస్తున్న ఎత్తుగడలు ఎంత మేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.





