Rs Praveen : ప్రవీణ్ రాకతో ఆ వర్గం బీఆర్ ఎస్ కు చేరువయ్యేనా..?
Qubetvnews - March 17, 2024 / 01:12 PM IST
Rs Praveen : కేసీఆర్ చాలా ముందు చూపుతో రాజకీయాలు చేస్తుంటారు. ఆయనకు ఏ వర్గం అయితే దూరం అవుతుందని భావిస్తుంటారో.. ఆ వర్గాన్ని దగ్గరకు చేసుకునేందుకు రెడీ అవుతుంటారు. ఇందులో భాగంగానే ఇప్పటికే చాలా వర్గాలను కలుపుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏయేవర్గం ఆయనకు వ్యతిరేకంగా ఓట్లు వేశారో కేసీఆర్ అంచనాలు వేసుకుంటున్నారు. వాస్తవానికి అంతకు ముందు రెండు ఎన్నికల్లో బీఆర్ ఎస్ కుదళితుల ఓట్లు గంపగుత్తగా పడ్డాయి. అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఎందుకో మొన్నటి ఎన్నికల్లో దళితుల ఓట్లు బీఆర్ ఎస్ కు పడలేదు.
ఇంకా చెప్పాలంటే రాష్ట్రంలో 19 ఎస్సీ నియోజకవర్గాలు ఉంటే అందులో కేవలం 3 చోట్ల మాత్రమే బీఆర్ ఎస్ గెలిచింది. మిగతా 16 చోట్ల దారుణంగా ఓడిపోయింది. దీన్ని బట్టి దళితులు బీఆర్ ఎస్ కుఎంత వ్యతిరేకంగా మారారో అర్థం చేసుకోవచ్చు. అందుకే వారిని దగ్గరకు చేసుకునేందుకు కేసీఆర్ రెడీ అయ్యారు. దళిత బంధు స్కీమ్ వల్ల దళితుల్లో కొద్ది మందికే లబ్ది జరగడంతో మిగతా వారంతా తీవ్ర వ్యతిరేకంగా మారారు. అందుకే కేసీఆర్ కు వారు వ్యతిరేకంగా ఓట్లేశారు. ఆ విషయాన్ని గమనించిన కేసీఆర్.. ఇప్పుడు దళితుల ఓట్లు కొల్లగొట్టేందుకు రెడీ అయ్యారు.
ఇందులో భాగంగా బీఎస్పీతో పొత్తులు పెట్టుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల ఆ పొత్తులు రద్దయ్యేలా కనిపించాయి. దాంతో ఇప్పుడు దళితుల ఐకాన్ లీడర్ గా ఉన్న ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ను బీఆర్ ఎస్ లోకి చేర్చుకుంటున్నారు. ప్రవీణ్ కుమార్ కు అటు దళితుల్లో మంచిపట్టు ఉంది. అంతే కాకుండా చాలా వర్గాల్లో ఆయనకు గట్టి పట్టు ఉంది. మేథావులు, విద్యావంతులు, యూత్ లో కూడా ప్రవీణ్ కుమార్ కు గట్టి పట్టు ఉంది. అందుకే ఇప్పుడు బీఆర్ ఎస్ లో ఆయన్ను చేర్చుకుంటే ఆయన వెనకాల ఉన్న వర్గాలు అన్నీ బీఆర్ ఎస్ కు జై కొడుతాయని కేసీఆర్ మాస్టర్ స్కెచ్ వేశారు.
ఇది ఒక రకంగా బీఆర్ ఎస్ కు కలిసొచ్చే అంశం అనే చెప్పుకోవాలి. కేసీఆర్ పార్టీ నుంచి ఇప్పటికే చాలా మంది వెళ్లిపోతుంటే పార్టీ గ్రాఫ్ పడిపోతోందనే టాక్ నడుస్తోంది. ఇలాంటిసమయంలో ప్రవీణ్ కుమార్ వస్తే ఎంతో కొంత గ్రాఫ్ పెరుగుతుందని అంటున్నారు రాజకీయ నిపుణులు.
ఈ విషయంలో ఇప్పటికే కేసీఆర్ ఆలోచించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి పార్టీ నుంచి వెళ్లిపోతున్న వారే ఉన్నారు తప్పవస్తున్న వారు లేరనే విమర్శకు ఈ విధంగా చెక్ పెట్టే అవకాశం దొరికింది.



