BJP : బీజేపీ మాస్టర్ ప్లాన్.. బీఆర్ఎస్ అలెర్ట్ కాకుంటే నష్టమే..?
Qubetvnews - February 29, 2024 / 01:42 PM IST
BJP :
అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. త్వరలోనే ఎంపీ ఎన్నికలు రాబోతున్నాయి. దాంతో ఇప్పుడు తెలంగాణలోని అన్ని పార్టీలు ఎంపీ ఎన్నికల కోసం రెడీ అవుతున్నాయి. ఇప్పటికే చాలా స్పీడుగా కాంగ్రెస్, బీఆర్ ఎస్ దూకుడు ప్రదర్శిస్తున్నాయి. దాంతో అటు బీజేపీ కూడా అలెర్ట్ అయిపోయింది. మేమేం తక్కువ కాదని.. ఇప్పటికే యాత్రలు కూడా నిర్వహిస్తున్నారు బీజేపీ నేతలు. కాగా బీజేపీ ఎంత చెప్పుకున్నా సరే చాలా పార్లమెంట్ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు కమలం పార్టీకి లేరు. అందుకే ఇప్పుడు బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. ఇందుకోసం బీఆర్ఎస్ పై వల వేయబోతోంది.
బీఆర్ఎస్ నుంచి గత ఎన్నికల్లో ఎంపీలుగా గెలిచిన వారు కొందరు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి కొందరికి టికెట్ రాదనే సంకేతాలు వస్తుండటం.. అంతే కాకుండా ప్రతిపక్షంలో బీఆర్ఎస్ నుంచి కొందరికి టికెట్లు వచ్చినా గెలుస్తామనే నమ్మకం వారికి లేదు. పార్లమెంట్ ఎన్నికలు అంటే జాతీయ పార్టీలకు ఉన్నంత ప్రాధాన్యత లోకల్ పార్టీలకు ఉండదు. ప్రజలు కూడా జాతీయ పార్టీలవైపే ఎక్కువగా చూస్తుంటారు. ఇప్పుడు మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే ప్రచారం బలంగా జరుగుతోంది.
అందుకే చాలామంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు బీజేపీ వైపు చూస్తున్నారంట. నాగర్ కర్నూల్ బీఆర్ ఎస్ ఎంపీ రాములు బీజేపీలోకి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారంట. ఇందుకు బలం చేకూరే విధంగా మొన్న జరిగిన నాగర్ కర్నూల్ ఆత్మీయ సమావేశానికి ఆయన దూరంగా ఉన్నారు. ఈయన బాటలోనే మరికొందరు కూడా బీజేపీలోకి వెళ్లేందుకు రెడీగా ఉన్నారంట. ఖమ్మం జిల్లాకు చెందిన ఒక ఎంపీ కూడా బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా మెదక్ జిల్లాకు చెందిన ఒక ఎంపీ కూడా బజేపీ వైపు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
బీజేపీ నుంచి వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఎంపీ టికెట్ హామీ ఇస్తే వెళ్లేందుకు వీరంతా రెడీ అవుతున్నారంట. కేంద్రంలో బీజేపీ హవా బాగానే ఉంది. కాబట్టి బీజేపీ టికెట్ దక్కించుకుంటే కచ్చితంగా గెలిచేందుకు అవకాశాలు ఉంటాయనేది వారి ప్లాన్. ఇందుకోసం బాగానే ప్లాన్లు వేసుకుంటున్నారు.
అయితే బీఆర్ఎస్ మాత్రం ఇప్పటి వరకు ఇలా పక్క చూపులు చూస్తున్న వారికి ఎలాంటి వార్నింగ్ లు గానీ.. బుజ్జగించడాలు, రాజకీయ పరమైన హామీలు ఇవ్వట్లేదు. ఇలాగే ఉంటే మాత్రం బీఆర్ ఎస్ కు కచ్చితంగా ఎదురు దెబ్బలు తగులుతాయని అంటున్నారు. మరి బీఆర్ఎస్ అగ్ర నేతలు వీరి పట్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.




