Ys Jagan : మద్యం రేట్లను వాడుకోని జగన్.. అనవసరంగా టైమ్ వేస్ట్ చేస్తున్నారా..?
Qubetvnews - October 18, 2024 / 09:43 PM IST
Ys Jagan : ఏపీలో ఇప్పుడు మాజీ సీఎం జగన్ ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న నాలుగు ప్రధాన పార్టీల్లో మూడు అధికారంలో ఉంటే.. ఒక్క వైసీపీ మాత్రమే ప్రతిపక్షంలో ఉంది. కాబట్టి జనాల చూపు ఆటోమేటిక్ గా మూడు పార్టీల మీద కంటే.. సింగిల్ పార్టీ మీదనే ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు జగన్ ఏం చేసినా.. ప్రభుత్వం మీద ఎలా పోరాడినా సరే జనాలు ఓన్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ జగన్ ఇప్పుడు వస్తున్న అవకాశాలను సంపూర్ణంగా వాడుకోవట్లేదనే విమర్శలు వస్తున్నాయి.
మొన్న లడ్డూ కల్తీ విషయంలో దేశ వ్యాప్తంగా ఎంత రచ్చ జరిగిందో చూశాం. ఆ విషయంలో జగన్ తప్పు చేయలేదని తనను తాను డిక్లేర్ చేసుకునే విషయంలో కొంత వెనకబడ్డారు. జగన్ మీద ఆరోపణలు చేయడం చంద్రబాబు, పవన్ బాగా సక్సెస్ అయ్యారు. ఇక సుప్రీంకోర్టులో కూటమి ప్రభుత్వానికి చుక్కెదురు అయినా సరే.. జగన్ దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోలేకపోయారు. ఈ రోజుల్లో ఎంత బాగా ప్రచారం చేసుకుంటే ప్రజల్లోకి అంత బలంగా వెళ్తారనే విషయాన్ని జగన్ ఎందుకు మర్చిపోతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చింది కూడా ఇలాంటి ప్రచారాలతోనే కదా.
ఇప్పుడు జగన్ ఇంకో విషయాన్ని కూడా పక్కన పెట్టేస్తున్నారు. అదే మద్యం రేట్లు. మద్యం పాలసీతో తక్కువ ధరకే మద్యం అమ్మకాలు చేస్తామని కూటమి హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం పాతరేట్లతోనే మద్యం అమ్మకాలు చేస్తున్నారు. పైగా కొన్ని బ్రాండ్లకు చాలా ఎక్కువ రేట్లు కూడా ఉన్నాయి. మరి అలాంటప్పుడు కూటమి మాట తప్పింది అనే ప్రచారాన్ని జగన్ ఎందుకు చేసుకోలేకపోతున్నారు. ఈ విషయంలో జగన్ కు వస్తున్న ఇబ్బందులు ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. సోషల్ మీడియాలో ఎంతో కొంత ప్రచారం చేసుకున్నా.. అది జగన్ నోటి నుంచి రావట్లేదు కాబట్టి.. పెద్దగా ప్రాధాన్యత రావట్లేదు.
ఒకవేళ జగన్ నోటి నుంచి విమర్శలు వచ్చి.. దాన్ని పెద్ద ఎత్తున వైసీపీ లీడర్లు ప్రజల్లోకి తీసుకెళ్తే.. ఈ పాటికి జగన్ కు కావాల్సినంత పబ్లిసిటీ వచ్చి ఉండేది. అవకాశాలు వస్తున్నా జగన్ మాత్రం వాటిని సద్వినియోగం చేసుకోవడం వెనకబడుతున్నారనే చెప్పుకోవాలి.




