Patnam Sunitha Mahender Reddy : మార్పు రావాలంటే, కాంగ్రెస్ రావాలి : సునీత మహేందర్ రెడ్డి
Qubetvnews - May 12, 2024 / 10:54 AM IST
Patnam Sunitha Mahender Reddy :
మినీ ఇండియాగా పిలువబడుతున్న మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి చివరి రోజు ఎన్నికల ప్రచారంలో కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు సునీత గెలుపు కోసం ఆమెకు మద్దతుగా ప్రచారం చేశారు. దేశంలోనే నెం.1 నియోజకవర్గంగా మల్కాజ్ గిరిని అభివృద్ది చేసే బాధ్యత తనది అని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనను గెలిపించాల్సిందిగా సునీత మహేందర్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ప్రచారంలో భాగంగా సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ… మార్పు రావాలి అంటే కాంగ్రెస్ రావాలి, అభివృద్ది జరగాలి అంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలి, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక ఖచ్చితంగా మల్కాజ్ గిరిని అద్భుతంగా అభివృద్ది చేస్తాను. దేశంలో మళ్లీ బిజెపి ప్రభుత్వం ఏర్పడితే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దుచేసి కుట్ర చేస్తున్నారు. కాబట్టి మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నన్ను మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిపించి, దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతి ఒక్కరు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మనం వేసే ఓటు, మన భవిష్యత్తుకు తొలిమెట్టు అంటూ సునీత మహేందర్ రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు.
విభజన హామీలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు, పసుపుబోర్డు, రైల్వే ప్రాజెక్టుల తదితర అభివృద్ది పనులు జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటూ సునీత మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. పట్నం సునీతా మహేందర్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు స్పెషల్ మేనిఫెస్టోను ప్రకటించారు. నియోజకవర్గంలో మురుగునీటి శుద్ధి ప్లాంట్లను అందుబాటులోకి తెస్తామన్నారు. కాలుష్య నియంత్రణకు గ్రీన్ ఇండస్ట్రీలు నెలకొల్పటంతో పాటు కాలుష్య కారక పరిశ్రమలను మూసివేస్తామన్నారు. రోడ్ల మరమ్మతులు, విస్తరణ, లింకు రోడ్ల అభివృద్ధి, అండర్‌పాస్, ఫ్లైఓవర్లు నిర్మించి ట్రాఫిక్ రద్దీ లేకుండా చూస్తామన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో యాంటీ-ఫ్లడ్డింగ్ మౌలిక వసతుల కల్పన ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నియోజక వర్గంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలను అభివృద్ధి చేయడంతో పాటు జేఈఈ, నీట్ తదితర పరీక్షలకు శిక్షణ ఇప్పిస్తామన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో నిత్యం వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రప్రభుత్వం తరఫున ఇప్పటికే మెట్రో సేవల విస్తరణకు సీఎం హామీ ఇచ్చారని.. కుత్బుల్లాపూర్, ఎల్‌బీనగర్, ఉప్పల్ వైపు ఐటీ రంగం విస్తరించడానికి కృషి చేస్తామని సునీతా మహేందర్ రెడ్డి మేనిఫెస్టోలో వెల్లడించారు.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఇప్పటికే సగానికి పైగా అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది. మల్కాజ్ గిరి ఓటర్లు నాకు ఓటు వేయడం ద్వారా అభివృద్దికి ఓటు వేసినట్లు అవుతుంది. రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలుపుకోవడం లో ముందు ఉంటారు. కనుక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తాం అంటూ సునీత హామీ ఇచ్చారు. మల్కాజ్ గిరి ఓటర్లకు మాయ మాటలు చెబుతున్న బీజేపీ మరియు బీఆర్‌ఎస్ పార్టీలను నమ్మవద్దు అంటూ ఆమె పిలుపునిచ్చారు. బీజేపీకి బీ టీం బీఆర్‌ఎస్ అని, అందుకే బీఆర్‌ఎస్ కు ఓటు వేస్తే అది బీజేపీ ఖాతాలోకి వెళ్తుంది అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి అంటూ సునీత మహేందర్ రెడ్డి అన్నారు.





