Congress Party : మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్ కు కలిసి వచ్చే అంశాలు ఇవే

Qubetvnews - May 4, 2024 / 09:59 AM IST

Congress Party : మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్ కు కలిసి వచ్చే అంశాలు ఇవే

Congress Party :

దేశం మొత్తంలో అత్యధిక ఓటర్లు ఉన్న పార్లమెంట్ నియోజకవర్గంగా మల్కాజ్‌గిరి ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మాత్రమే కాకుండా దేశ రాజకీయాలను కూడా తన వైపుకు తిప్పుకున్న ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే విషయం తెల్సిందే. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో  స్థానికేతరుడు అయినా కూడా రేవంత్‌ రెడ్డికి అక్కడి ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. అప్పటి అధికార బీఆర్‌ఎస్ పార్టీని కాదని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అభ్యర్థిని కాదని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రేవంత్ రెడ్డిని గెలిపించడం జరిగింది. ఈసారి కూడా అదే జరగబోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉండటం వల్ల విజయం నల్లేరు మీద నడక అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పట్నం సునీత మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈమెకు రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది. అంతే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రచారం ఈమెకు కలిసి వచ్చే అంశం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన హామీలను ప్రజల్లోకి తీసుకు వెళ్లి ముందు ముందు అన్ని హామీలను నెరవేర్చుతామంటూ ప్రచారం చేయడం ఈమెకు కలిసి వస్తున్న అంశం. బీఆర్‌ఎస్ ఓటు బ్యాంక్ మొత్తం కూడా రాజకీయ కారణాలతో కాంగ్రెస్ కు మళ్లింది. దాంతో బీజేపీ ఆశలపై నీళ్లు జల్లినట్లు అవుతుందని రాజకీయ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. సర్వేల్లో కాంగ్రెస్ కి అనుకూలంగా ఫలితం వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే వచ్చిన వార్తలు కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది.

కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మల్కాజ్ గిరి పార్లమెంట్‌ నియోజకవర్గ విజయం పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ముఖ్య నాయకులు అంతా కూడా నియోజకవర్గంలోని వివిధ అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారం చేస్తూ ఉన్నారు. సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో అభివృద్ది చేస్తూ వస్తున్న కారణంగా పట్నం సునీత మహేందర్‌ రెడ్డి గెలుపు కు దోహదం చేసే అవకాశాలు ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకత, బీఆర్‌ఎస్ ను జనాలు వీడటం వంటి కారణాలు సునీతమ్మ గెలుపుకు కారణం అయ్యే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నారు. మోడీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగంను మార్చేస్తాడు, రిజర్వేషన్లు రద్దు చేస్తాడంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ నియోజకవర్గంలో పని చేసే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా మల్కాజ్‌గిరి మళ్లీ కాంగ్రెస్‌ ఖాతాలో చేరడం ఖాయంగా కనిపిస్తుంది.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News