Revanth Reddy : ఎంపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యం.. మెట్టు దిగుతున్న రేవంత్..!
Qubetvnews - April 11, 2024 / 09:09 AM IST
Revanth Reddy : రేవంత్ రెడ్డ ఇప్పుడు చాలా పరిణతి చెందిన రాజకీయాలు చేస్తున్నారు. మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా దూకుడుగా వ్యవహరించారు. ఎవరైనా ఏమైనా అంటే.. ఆయన పది మాటలు అనేవారు. కొన్ని సార్లు పార్టీ కోసం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని మరీ ముందుకు వెళ్లిన సంఘటనలు ఉన్నాయి. అందుకే పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన అనుచర వర్గం చెప్పుకుంటారు. అయితే ఇప్పుడు రేవంత్ అనుకున్నట్టే పార్టీని గెలిపించుకున్నారు. ఆయన సీఎం అయి చూపించారు. దాంతో పాటు ఇప్పుడు ఎంపీ ఎన్నికల బాధ్యతలను కూడా ఆయనే తీసుకున్నారు.
కాగా రేవంత్ ఈ ఎంపీ ఎన్నికల్లో చాలా వరకు తన మద్దతుదారులకే టికెట్లు కేటాయించుకున్నారు. అయినా సరేమొన్నటి వరకు రేవంత్ ను వ్యతిరేకించిన వారంతా ఇప్పుడు రేవంత్ కే సపోర్టు చేస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి కూడా తన వర్గం అభ్యర్థుల కోసం ఓ మెట్టు దిగేందుకు కూడా ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశాలను అన్నీ తన ఇంట్లోనే నిర్వహించారు. కానీ కేవలం భువనగిరి ఎంపీ నియోజకవర్గ సమావేశం మాత్రం మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇంట్లో నిర్వహించారు.
ఇందుకోసం రేవంత్ రెడ్డి తాను సీఎం అనే స్థాయిని కూడా పక్కన పెట్టి మరీ రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లారు. రాజగోపాల్ రెడ్డిని ఇప్పుడు భువనగిరి పార్లమెంట్ ఇన్ చార్జిగా నియమించారు. వాస్తవానికి ఇక్కడి నుంచి తన భార్యకు ఎంపీ టికెట్ ఇప్పించుకోవాలని రాజగోపాల్ రెడ్డి చాలానే ప్రయత్నాలు చేశారు. అటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా తన అనుచరుడికే టికెట్ కేటాయించాలని కోరారు. అయినా సరే రేవంత్ మాత్రం వారందరినీ పక్కన పెట్టేసి తన అనుచరుడు అయిన చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నాడు. ఇప్పుడు ఆయన గెలపుకోసం ఓ మెట్టు దిగేందుకు కూడా ఇష్టపడుతున్నాడు.
అందుకే ఆయన రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లారు. గతంలో బీజేపీలోకి రాజగోపాల్ రెడ్డి వెళ్లినప్పుడు రేవంత్ ను ఎంతగా తిట్టాడో మనందరికీ తెలిసిందే. అప్పుడు రేవంత్ కూడా రాజగోపాల్ రెడ్డిని తిట్టాడు. అయితే ఇప్పుడు వాటన్నింటినీ ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం పక్కన పెట్టాడు రేవంత్ రెడ్డి.
ఇక ముందు కూడా ఆయా నియోజకవర్గాల స్థాయి సమావేశాలను సదరు ఇన్ చార్జి ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి నిర్వహిస్తాడని తెలుస్తోంది. ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు కూడా చేస్తున్నారంట. ఇలా రేవంత్ తన అభ్యర్థుల గెలుపు కోసం ఒక మెట్టు దిగడాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.





