Allu Arjun : చట్టానికి కట్టుబడి నడుచుకుంటున్న అల్లు అర్జున్..!
Qubetvnews - December 30, 2024 / 03:02 PM IST
Allu Arjun : అల్లు అర్జున్ మొదటి నుంచి చట్టానికి కట్టుబడే వ్యవహరిస్తున్నారు. ఏ విషయం అయినా సరే కోర్టు పరిధిలో చట్ట ప్రకారమే తేలాలని నమ్ముతున్నారు. చట్టం తనకు న్యాయం చేస్తుందని ఆయన విశ్వాసంతో ఉంటున్నారు. అందుకే ఎవరెన్ని కారు కూతలు కూస్తున్నా సరే మౌనంగా ఉంటున్నారు. సంధ్య థియేటర్ ఘటన జరిగినప్పటి నుంచి అల్లు అర్జున్ వ్యవహార శైలిని చూస్తేనే ఈ విషయం అర్థం అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఆయన బాధ్యతాయుతమైన ప్రవర్తన కనిపిస్తుంది. క్రౌడ్ ఎక్కువ అవుతుందని వెళ్లిపోమని చెప్పిన వెంటనే ఆయన థియేటర్ నుంచి వెళ్లిపోయారు. రేవతి చనిపోయిందనే విషయం తెలియగానే వెంటనే స్పందించారు.
తాను లీగల్ గా హాస్పిటల్ కు వెళ్లలేకపోయినా సరే.. తన టీమ్ ను పంపించి శ్రీ తేజ్ కు ఆపరేషన్ జరిపించారు. బాబు వైద్య ఖర్చులు ఎంతైనా సరే భరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పేశారు. సంధ్య థియేటర్ ఘటన తర్వాత పోలీసులు అరెస్ట్ చేసినా సరే అందుకు సహకరించారు. చట్ట ప్రకారం బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చారు. అంతే తప్ప ఎక్కడా కూడా చట్టాన్ని దాటుకుని వెళ్లేందుకు గానీ.. తప్పించుకునేందుకు గానీ ప్రయత్నించలేదు. అంత డబ్బు, స్టార్ స్టేటస్ ఉన్నా సరే.. బన్నీ మాత్రం బాధ్యత గల పౌరుడిగానే వ్యవహరిస్తున్నారు. శ్రీతేజ్ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు.
ప్రత్యేకంగా తన టీమ్ ను హాస్పిటల్ లోనే ఉంచారు. తన తండ్రి అల్లు అరవింద్ ను ఇప్పటికే రెండు సార్లు హాస్పిటల్ కు పంపించారు. రేవతి కుటుంబాన్ని ఆదుకునేందుకు పుష్ప టీమ్ నుంచి ఏకంగా రూ.2కోట్ల సాయం కూడా అందించాడు. ఇంత చేస్తున్నా సరే కొందరు మాత్రం పనిగట్టుకుని బన్నీ మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఏదో మందబలం ఉంది కదా అని కొందరు అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసి దాన్ని ఏదో గొప్పగా చెప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండస్ట్రీకి ఏదో వార్నింగ్ ఇస్తున్నట్టు బిల్డప్ లు కొడుతున్నారు. వాళ్లు ఇన్ని అరాచకాలు చేస్తున్నా సరే వారిపై సరైన చర్యలు లేవు.
ఇలా ఎంత మంది ఎన్ని విధాలుగా తన ఇంటి మీద దాడులు చేస్తున్నా.. తన మీద మాటల దాడులు చేస్తున్నా సరే సంమయమనంతోనే ఉంటున్నారు అల్లు అర్జున్. తన మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాత్రమే మీడియాకు వివరించారు తప్ప.. ఎవరినీ కించ పరిచే విధంగా గానీ ఆయన మాట్లాడలేదు. అందరినీ గౌరవిస్తున్నట్టు క్లారిటీ కూడా ఇచ్చాడు. చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇస్తే.. అక్కడకు కూడా సరైన టైమ్ కు వెళ్లాడు. ఇలా చట్టాన్ని గౌరవిస్తూ.. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్న అల్లు అర్జున్ క్యారెక్టర్ ను అందరూ గుర్తిస్తున్నారు.




