Revanth Reddy : బీజేపీలోకి రేవంత్ రెడ్డి.. మొన్న బీఆర్ ఎస్, ఇప్పుడు బీజేపీ.. ఏంటీ గందరగోళం..?
Qubetvnews - April 16, 2024 / 08:54 AM IST
Revanth Reddy : తెలంగాణలో ఇప్పుడు అందరి ఫోకస్ రేవంత్ రెడ్డి మీదనే ఉంది. ఎందుకంటే పత్తా లేకుండా పోతున్న పార్టీ పగ్గాలు తీసుకుని.. రెండున్నరేళ్లలోనే అధికారంలోకి తేవడం అంటే మాటలు కాదు. రాజకీయ దురంధరుడు అయిన కేసీఆర్ వ్యూహాలను తిప్పికొట్టి మరీ బీఆర్ ఎస్ ను గద్దె దించి కాంగ్రెస్ ను అందలం ఎక్కించాడు రేవంత్ రెడ్డి. అందుకే ఆయన ఇప్పుడు పవర్ ఫుల్ లీడర్ అయిపోయాడని చెప్పుకోవాలి. అందుకే ఇప్పుడు అటు బీఆర్ ఎస్ గానీ, ఇటు బీజేపీ గానీ రేవంత్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇప్పుడు కేవలం రేవంత్ మాత్రమే అన్నట్టు అందరూ మాట్లాడుతున్నారు.
అంతగా ప్రభావితం చేసిన రేవంత్ రెడ్డిపై ఇప్పుడు బీఆర్ ఎస్, బీజేపీ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ లోనే కల్లోలం సృష్టించి నమ్మకాన్ని దెబ్బకొట్టాలని బీఆర్ ఎస్, బీజేపీ పార్టీలు వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ మధ్య కేటీఆర్ మాట్లాడుతూ.. ఎంపీ ఎన్నికలు అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి వెళ్లి బీజేపీలో చేరుతారంటూ సంచలన ప్రకటన చేశాడు. దాంతో అప్పటి నుంచే కాంగ్రెస్ లో ఓ అనుమానం మొదలైంది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన కామెంట్లు మరింత సంచలనం రేపుతున్నాయి.
తాజాగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తానంటే తాను సాదరంగా ఆహ్వానిస్తానంటూ తెలిపారు. రేవంత్ రెడ్డి వస్తానంటే ఓ స్నేహితుడిలా తాను సహకరిస్తానంటూ వివరించారు. అంతే కాకుండా రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించాడు అరవింద్. రేవంత్ లాంటి యాక్టివిస్టు బీజేపీలో ఉంటేనే బెటర్ అని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి సమర్థుడే అని కాంగ్రెస్ పార్టీనే అసమర్థ పార్టీ అని అన్నారు. కాబట్టి కాంగ్రెస్ లో ఉంటే రేవంత్ అసమర్థుడు అవుతాడని.. బీజేపీలోకి వస్తే ఇక్కడ చక్కగా పని చేసుకోవచ్చని తెలిపాడు అరవింద్. దాంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు మంటలు పుట్టిస్తున్నాయి.
ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి కామెంట్లు చేయడం అంటే మాటలు కాదు. అరవింద్ ఈ కామెంట్లు చేశారు అంటే అది రాజకీయ వ్యూహంలో భాగం అయినా ఉండాలి. లేదంటే ఆయనకు రేవంత్ రెడ్డి చేరికపై పక్కా సమాచారం అయినా ఉండాలి అనే ఆలోచనలు కాంగ్రెస్ కార్యకర్తలో వస్తున్నాయి.
ఇలా రేవంత్ మీద కేటీఆర్, అరవింద్ చేస్తున్న కామెంట్లు కాంగ్రెస్ లో గందరగోళాన్ని రేపుతున్నాయి. దాంతో ఇప్పుడు రేవంత్ మీదనే అనుమానాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీనిపై రేవంత్ ఏదో ఒక క్లారిటీ ఇస్తే గానీ ఈ రూమర్లు ఆగేలా లేవని అంటున్నారు.


