Revanth Reddy : ఇటు పార్టీ, అటు ప్రభుత్వం.. రేవంత్ గుప్పిట్లోకి..!
Qubetvnews - June 18, 2024 / 08:13 PM IST
Revanth Reddy : రేవంత్ రెడ్డి టైమ్ మారిపోయింది. ఒకప్పుడు ఆయన్ను సొంత పార్టీ నేతలే తిట్టుకునేవారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఢిల్లీకి వెళ్లి మరీ ఫిర్యాదులు చేశారు. వెంటనే రేవంత్ ను అధ్యక్ష పదవి నుంచి తీసేయాలంటూ రకరకాల ప్రయత్నాలు చేశారు. కొందరు పార్టీనే వదిలి వెళ్లిపోయారు. ఇంకొందరే రేవంత్ ను తిడుతూ పార్టీకి దూరంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు రేవంతే అసలు సిసలైన నాయకుడు అని తిట్టుకున్న వారే పొగిడే దాకా వచ్చాడు తెలంగాణ సీఎం. అసలు నువ్వు అధ్యక్షుడివేంటి అన్న నోర్లే.. ఇప్పుడు నాయకుడంటే ఇలాగే ఉండాలి అని అంటున్నాయి.
వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో ఒక వ్యక్తికి రెండు పదవులు ఉండవు. కానీ ఇప్పుడు తెలంగాణలో మాత్రం పరిస్థితి అలా లేదు. పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డే, సీఎం కూడా రేవంత్ రెడ్డే. అందుకే ఇప్పుడు రెండు వైపులా ఆయన నిర్ణయాలే ఫైనల్ అవుతున్నాయి. అయితే రేవంత్ సీఎం అయిన కొత్తలో పార్టీలో కూడా కొంత మంది ఆయన్ను వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు రాను రాను పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రేవంత్ రెడ్డికే అంతా జై కొడుతున్నారు. ఇప్పుడు పార్టీలో రేవంత్ నిర్ణయమే ఫైనల్. అటు ప్రభుత్వంలో కూడా అంతే ఉంది. ప్రభుత్వంలో చాలా మంది సీనియర్లకు మంత్రి పదవులు దక్కాయి.
అయితే ఈ సీనియర్లు అందరూ మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ ను తిట్టిన వారే. అలాంటి వారు ఇప్పుడు తమ శాఖల్లో కూడా ఏదైనా హామీ ఇవ్వాలన్నా సరే రేవంత్ చెబితేనే ఇస్తున్నారు. ఇంకా కొంచెం పెద్ద హామీ అయితే స్వయంగా రేవంత్ మాత్రమే దానిపై హామీ ఇస్తున్నాడు. అంటే ప్రభుత్వం పూర్తిగా రేవంత్ గుప్పిట్లోనే ఉందన్నమాట. ఇటు పార్టీలో కూడా అంతే. ఎవరికి ఎలాంటి పదవులు పార్టీలో ఇవ్వాలన్నా సరే ఇప్పుడు రేవంత్ కనుసైగల ఆదేశాలతోనే సాగుతోంది. ఎవ్వరైనా సరే రేవంత్ చెప్పినట్టే వింటున్నారు తప్ప.. ఆయన గీసిన గీత దాటిపోవట్లేదు.
అంటే పార్టీలో, అయినా ప్రభుత్వంలో అయినా ఇప్పుడు రేవంత్ మాటనే ఫైనల్ అవుతోందన్నమాట. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ అంటే రేవంత్.. రేవంత్ అంటే కాంగ్రెస్ అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఒకప్పుడు వైఎస్సార్ హయాంలో కూడా ఇదే జరిగింది. అలాంటి పరిస్థితులే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో మళ్లీ కనిపిస్తున్నాయని చెబుతున్నారు.


