Revanth Reddy : చేరికలతో కాంగ్రెస్ బలం పెరుగుతుందా? రేవంత్ బలం పెరుగుతుందా?
Qubetvnews - July 16, 2024 / 05:39 PM IST
Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొద్దిపాటి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బలం బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేల చేరికతో రోజు రోజుకు అనూహ్యంగా పెరుగుతూ వస్తోందని ఆ పార్టీ నాయకుల్లో కొందరు మాట్లాడుకుంటూ ఉంటే, కొందరు కాంగ్రెస్ నాయకులు మాత్రం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేరికతో పెరుగుతున్నది కాంగ్రెస్ బలం కాదని, రేవంత్ రెడ్డి బలం అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు.
కొత్తగా బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా రేవంత్ రెడ్డి వర్గంలోకి చేరుతున్నారు. కనుక పార్టీ లో ఏదైనా అసమ్మతి, వ్యతిరేకత వచ్చినా, సీనియర్ లు ముఖ్య మంత్రి పీఠం దక్కించుకునేందుకు ప్రయత్నించినా కూడా రేవంత్ రెడ్డి కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగానే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు అనే విశ్లేషన కొందరు రాజకీయ విశ్లేషకులు చేస్తున్నారు. ఇప్పటికే పది మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరి, రేవంత్ రెడ్డికి చేయి ఇచ్చారు.
బొటా బొటి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంను కూల్చేస్తాం అని, ఆ పార్టీ లోని ఎమ్మెల్యేలే మాకు టచ్ లో ఉన్నారు అంటూ బీజేపీ మరియు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడటంతో రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకుని బీఆర్‌ఎస్ ఎల్పీ నే విలీనం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు రేవంత్ రెడ్డి వర్గం పెద్ద వ్యూహాలనే అమలు చేస్తోంది అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ జరుగుతోంది.
చేరికల విషయమై కాంగ్రెస్ అధినాయకత్వం మొదట ఆసక్తి చూపించలేదని, అయితే రేవంత్ రెడ్డి వారిని ఒప్పించిన తర్వాతే ఈ చేరికలకు పచ్చ జెండా ఊపారట. రాజ్యాంగం ప్రకారం చేరికలు ఉండాలని రాహుల్ గాంధీ గతంలో పలు సందర్భాల్లో అన్నారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్న చేరికలు రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా ఉంది అనేది చాలా మంది విమర్శ. అయితే బీఆర్‌ఎస్ వాదిస్తున్నట్లుగా ఆ పార్టీ యొక్క ఎల్పీ ని విలీనం చేసుకుంటే ఎలాంటి విమర్శలు ఉండవు, పైగా రాహుల్ గాంధీ ని కూడా ఈ విషయంలో ఇబ్బంది లేకుండా ఒప్పించవచ్చు అనేది రేవంత్ రెడ్డి వ్యూహం. అందుకే బీఆర్‌ఎస్ఎల్‌పీ ని ఎట్టి పరిస్థితుల్లో విలీనం చేసుకునే వరకు ఆపరేషన్ ఆకర్ష కొనసాగించాలని భావిస్తున్నారు.
గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సయమంలో తన పార్టీని విలీనం చేస్తానంటూ సోనియా గాంధీకి కేసీఆర్ హామీ ఇచ్చాడు. ఆ హామీని కేసీఆర్ నిలుపుకోలేక పోయాడు. కానీ రేవంత్ రెడ్డి బలవంతంగా సోనియా గాంధీకి కేసీఆర్ ఇచ్చిన హామీని అమలు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాడు అనే చర్చ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో జరుగుతుంది. మరో వైపు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాత్రం బీఆర్‌ఎస్ నుంచి వస్తున్న వారు మొత్తం రేవంత్ రెడ్డి వైపే వెళ్లకుండా ఉండేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారట.
భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా, రేవంత్ రెడ్డి ముందస్తుగా చేస్తున్న ఈ గ్రౌండ్ వర్క్ ఆ పార్టీ సీనియర్ నాయకులకు మింగుడు పడక పోవచ్చు. ఎందుకంటే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల చేరికతో కాంగ్రెస్ పార్టీ బలం పెరగడం కాకుండా పార్టీలో రేవంత్ రెడ్డి బలం పెరుగుతున్నట్లుగా అవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో రేవంత్ రెడ్డి బలం పెరిగితే తమకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు సన్నగిల్లుతాయి అనేది వారి ఆందోళన.
వచ్చే ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించి ముందుకు వెళ్లే విధంగా ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ జరుగుతుందేమో అని సీనియర్ లు మాట్లాడుకుంటున్నారాట.. రేవంత్ రెడ్డి వేస్తున్న ఈ వ్యూహాత్మక అడుగులు పార్టీకి ప్రయోజనాన్ని కలిగిస్తున్నాయా… ఆయన సొంత ప్రయోజనం కోసమా అనేది కాలమే నిర్ణయిస్తుంది.





