Kcr : ఎంపీ ఎన్నికల్లో కేసీఆర్ కొత్త వ్యూహం.. ఆ ఫలితం మళ్లీ రావొద్దని..!
Qubetvnews - March 23, 2024 / 11:38 AM IST
Kcr : కేసీఆర్ ఒక సారి ఒక వ్యూహాన్ని రచిస్తున్నారంటే.. దాని వెనకాల చాలా రకాల పెద్ద కారణాలే ఉంటాయి. అందులో ఎలాంటి అనుమానాలు లేవు. ఆయన ఒకసారి ఎంచుకున్న వ్యూహం బెడిసికొట్టిందంటే మాత్రం కచ్చితంగా దానికి భిన్నంగా ఉన్న వ్యూహాన్ని అమలు చేయాలని తాపత్రయ పడుతుంటారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కు ఎదురు దెబ్బలు తగిలాయి. దాంతో ఆయన ఇప్పుడు వ్యూహాన్ని మార్చేస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోవడమే తీవ్రమైన దెబ్బ కొట్టింది. ఎందుకంటే చాలా మంది ఎమ్మెల్యేల మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది.
ఆ విషయం కేసీఆర్ కు తెలిసినా సరే చివరి నిముషంలో మార్చలేక పాతవారికే టికెట్లు కేటాయించారు. దాంతో ఆ ఎన్నికల్లో ఘోరమైన దెబ్బ పడింది. దెబ్బకు పార్టీ ఓడిపోయింది. ఇంకేముంది ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో ఆ వ్యూహాన్ని అమలు చేయొద్దని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో ఆర్థికంగా బలంగా ఉన్న వారికి కాకుండా ఎవరికైతే గెలిచే అవకాశాలు ఉన్నాయో వారికే టికెట్లు కేటాయించేందుకు రెడీ అయిపోయారు కేసీఆర్. అంతే కాకుండా ఏయే వర్గాలు అయితే తన మీద, పార్టీ మీద తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయో వారిని దగ్గరకు చేర్చుకునేందుకు రెడీ అయ్యారు.
ఇందులో భాగంగానే ఈ సారి ఎంపీ ఎన్నికల్లో ఆయన వ్యతిరేకంగా ఉన్న వర్గాల నుంచి వచ్చిన నేతలకు టికెట్లు కేటాయించారు. దళితులు, బహుజనులు కేసీఆర్ పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అందుకే రాష్ట్రంలో 19 ఎస్సీ నియోజకవర్గాలు ఉంటే అందులో కేవలం 3 చోట్ల మాత్రమే బీఆర్ ఎస్ గెలిచింది. దళితుల ఓట్లను మళ్లీదగ్గరకు చేసుకునే క్రమంలో ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ను తన పార్టీలో చేర్చుకున్నారు కేసీఆర్. అంతే కాకుండా ఇతర ఆర్థిక, సామాజికంగా బలంగా ఉన్న నేతలకు టికెట్లు కేటాయిస్తున్నారు. మేథావులను దగ్గర చేసుకునేందుకు ఇప్పుడు మెదక్ ఎంపీ సీటును రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వెంకట్రామ్ రెడ్డికి కేటాయించారు.
దాంతో పాటు ఇతర చోట్ల కూడా బీఆర్ ఎస్ వ్యతిరేకంగా ఉన్న సామాజిక వర్గాలకు చెందిన నేతలకు టికెట్లు కేటాయించారు. ఇప్పుడు ఈ విషయమే బీఆర్ ఎస్ మైలేజ్ ను పెంచుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. ఇంతకు ముందు ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్న నేతలకు టికెట్లు ఇచ్చేవారు.
కానీ ఇప్పుడు మాత్రం ప్రజల్లో బలం ఉండి, గెలిచే సత్తా ఉన్న వారికి మాత్రమే టికెట్లు కేటాయిస్తున్నారు. తన పార్టీ పట్ల వ్యతిరేకతను తగ్గించేందుకు ఈ విధంగాప్లాన్ చేసుకుంటున్నారు కేసీఆర్. మరి ఆయన వేసిన ఎత్తుగడ ఏ మేరకు వర్కౌట్ అవుతుందనేది ఈ ఎన్నికల్లో తెలుస్తుంది.




