Children Care : మీ పిల్లలు టీవీ చూస్తేనే తింటున్నారా.. ఎంత డేంజరో తెలుసుకోండి..!
Qubetvnews - February 20, 2024 / 09:31 PM IST
Children Care :
ఈ రోజుల్లో పిల్లలకు టీవీ అనేది బాగా అలవాటు అయిపోయింది. ఒకప్పుడు పిల్లలు ఆటలతో గడిపేవారు. కానీ ఇప్పటి జనరేషన్ మొత్తం టీవీలు, ఫోన్లతోనే గడిపేస్తున్నారు. మరీ ముఖ్యంగా వారు తినేటప్పుడు టీవీ పెట్టాల్సిందే. వారికి ఇష్టం అయిన కార్టూన్ ఛానెల్స్ పెడితేనే వారు తింటారు. అది కూడా ఆ కార్టూన్ ఛానెల్ చూసుకుంటే గంట సేపు తింటుంటారు. ఇది ఒక ఇంట్లోనే కాదండోయ్.. చాలా ఇళ్లలో ఇదే సమస్య. అయితే తల్లిదండ్రులు కూడా దీన్ని లైట్ తీసుకుంటున్నారు. పిల్లలు ఇలా తింటే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని మాత్రం తల్లిదండ్రులకు తెలియదు.
తల్లిదండ్రులకు తెలిసిందల్లా తమ పిల్లలు అల్లరి చేయకుండా తింటున్నారు కాబట్టి అదే చాలు అని అనుకుంటారు. కానీ ఇలా టీవీ చూస్తే తింటే అసలు ఎంత తింటున్నామో.. ఎంత తినాలో కూడా పిల్లలకు తెలియదు. పైగా వారి మానసిక పరిస్థితిపై కూడా వారికి శ్రద్ద ఉండదు. అసలు ఆకలి ఎంత వేస్తోంది.. ఎంత తినాలి అనేది తెలియదు. దాంతో పిల్లల్లో ఊబకాయం సమస్యలు రావడం ఖాయం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నాయి. దాంతో పాటు ఒత్తిడి, టైప్-1డయాబెటిస్ రావడం ఖాయం అని చెబుతున్నారు. వయసు పెరిగే పిల్లల్లో ఇలాంటివి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తాయి.
దాని వల్ల పిల్లలు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. వాస్తవానికి భోజనం చేసే సమయంలో సమతుల్య ఆహారం అందించడం చాలా అవసరం. పిల్లలకు ఆరోగ్య కరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించాలి. పిల్లల బరువును బట్టి వారు ఎంత తినాలో అలవాటు చేయాల్సి ఉంటుంది. ఇది తల్లిదండ్రుల బాధ్యత. పోషకాహార ప్రయోజనాలకు మించి తల్లిదండ్రుల తమ పిల్లలతో భావోద్వేగ సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలి. భోజనం చేసేటప్పుడు పిల్లలతో కలిసి దగ్గరుండి మరీ తినేలా చూసుకోవాలి. వారికి చాలా విషయాలను వివరించి చెప్పాలి.
కానీ ఇలా తల్లిదండ్రులు పిల్లలను వదిలేస్తే మానసిక సంబంధిత సమస్యలు కచ్చితంగా వస్తాయి. అంతే కాకుండా వారికి అసలు తిండి మీద ధ్యాస అనేది కలగదు. ఇంకా చెప్పాలంటే టీవీ, ఫోన్ లేదినే తినలేని పరిస్థితులు కూడా వస్తాయి. వారికి ఆకలి మీద కంటే టీవీ, ఫోన్ మీదనే శ్రద్ద అనేవి పెరుగుతాయి.
కాబట్టి ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో టీవీ లేదా ఫోన్ ను తినేటప్పుడు ఇవ్వొద్దు. టీవీ రహిత భోజనాన్ని వారికి అలవాటు చేయాలి. అప్పుడే సరైన మోతాదులో తిండి తింటారు. వారి మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పిల్లలకు ఆహారపు అలవాట్లను చేయాలి.





