KCR : కవితకు ఎంపీ టికెట్ విషయంలో కేసీఆర్ కీలక నిర్ణయం.. మంచిదేనా..?
Qubetvnews - February 21, 2024 / 09:57 AM IST
KCR :
కేసీఆర్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పులను ఒక్కొక్కటిగా సరిదిద్దుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అన్ని వ్యవహారాలను ఆయనే స్వయంగా దగ్గరుండి మరీ చూసుకుంటున్నారంట. ఇందులో భాగంగా చాలా రోజులుగా కేసీఆర్ మీద ఉన్న కుటుంబ పాలన మార్క్ ను చెరిపేయాలని అనుకుంటున్నారంట. కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి కేసీఆర్ సీఎంగా ఉండటం, హరీశ్ రావు, కేటీఆర్ ఎమ్మెల్యేలుగా, కీలక శాఖలకు మంత్రులుగా ఉండటం వల్ల తీవ్రమైన నష్టం జరిగింది ఆ పార్టీకి. దాన్ని ప్రతిపక్షాలు కుటుంబ పాలనగా ప్రచారం చేశాయి.
వీటికి తోడు కవితను ఎంపీగా చేయడం.. ఆమె ఓడిపోయిన తర్వాత తిరిగి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం లాంటివి కూడా తీవ్ర విమర్శలకు దారి తీసింది. కుటుంబ పాలనను దూరం చేయాలని ప్రతిపక్షాలు పిలుపునివ్వడం కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లింది. దీంతో ఇప్పుడు ఆ విధానాలకు దూరంగా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారంట. ఇందులో భాగంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కల్వకుంట్ల కవితకు ఎంపీ టికెట్ ఇవ్వాలా వద్దా అనే అంశంపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంట. కవితకు టికెట్ ఇస్తే మళ్లీ కుటుంబ పాలన అనే మార్క్ తెరమీదకు వస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు.
అందుకే ఈ సారి ఎంపీ టికెట్ ఇవ్వొద్దని డిసైడ్ అయ్యారంట. ఇందులో భాగంగా కవితతో విస్తృతంగా ప్రచారం చేయించుకుని ఆమెను ఎన్నికల్లో పోటీ చేయించకుండా ఉంచాలని అనుకుంటున్నారు కేసీఆర్. ఇదే జరిగితే ఎంతో కొంత కుటంబ పాలన మార్క్ అనేది దూరం అవుతుందని కేసీఆర్ ఆలోచిస్తున్నారంట. మొన్నటి ఎన్నికల్లో పడ్డ ప్రచారాలకు చెక్ పెట్టాలనేది కేసీఆర్ ప్రధాన ఆలోచనగా కనిపిస్తోంది. అందుకే ఈ సారి ఎలాగైనా తమ పార్టీకి మేలు చేసే అంశాలను అందిపుచ్చుకోవాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారంట. ఇందులో భాగంగా ప్రక్షాళన తన ఇంటి నుంచే మొదలు పెట్టబోతున్నారని తెలుస్తోంది.
తన పార్టీలో ఉన్న వారితో చేయించే కంటే తానే ఆ పనిని మొదలు పెడితే ఇంకా బాగా వర్కౌట్ అవుతుందని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. అందుకే మొదట తన కూతురు కవితతోనే ఈ కుటుంబ పాలన అనే రిమార్క్ ను దూరం చేయాలని అనుకుంటున్నారంట కేసీఆర్. ఆమెకు వేరే ఏ పదవులు కూడా ఇవ్వొద్దని అనుకుంటున్నారంట.
ఇందులో భాగంగానే ఆమెను ఈ ఎంపీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా వాడుకోబోతున్నారని సమాచారం. కవితకు వాక్చాతుర్యం కూడా బాగానే ఉంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. పైగా తండ్రి, అన్న లాగానే మాటకారి. అందుకే ఇప్పుడు ఆమెను పదవులకు దూరంగా ఉంచి ప్రచార బాధ్యతలు అప్పగించబోతున్నారంట.




