BJP : టీడీపీ – జనసేన – బీజేపీ.. ఇష్టం లేని సంసారం చేస్తున్నాయా?
Qubetvnews - May 2, 2024 / 09:30 AM IST
BJP :
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలుగు దేశం పార్టీ మరియు జనసేన పార్టీలు కలిశాయి. జగన్ ను తామిద్దరం కలిసి ఓడించడం కష్టం అని భావించిన బాబు, పవన్ లు బతిమిలాడి మరీ బీజేపీని కూటమిలో చేర్చడం జరిగింది. ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్న పెళ్లి కూతురు తరహాలోనే బీజేపీ వ్యవహరిస్తుంది అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మోడీ ఇప్పటి వరకు ఏపీలో పెద్దగా బాబు, పవన్ లతో కలిసి ప్రచారంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపడం లేదు. అంతే కాకుండా తాజాగా విడుదల చేసిన మేనిఫెస్టో విషయంలో కూడా బీజేపీ అంటీ ముట్టనట్లుగా ఉంది. ఉమ్మడి మేనిఫెస్టో అంటూనే తెలుగు దేశం, జనసేన పార్టీల మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. మేనిఫెస్టో బుక్ పై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను వేసేందుకు బీజేపీ నాయకత్వం అంగీకరించలేదు.
మేనిఫెస్టో లో ఉన్న పలు అంశాలకు బీజేపీ వ్యతిరేకంగా ఉంది. బాహాటంగానే బీజేపీ నాయకులు పలువురు మీడియా ముందుకు వచ్చి ఆ మేనిఫెస్టో లో ఆచరణ సాధ్యం కాని హామీలు చాలా ఉన్నాయి. ఆ మేనిఫెస్టో కు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు అంటూ తేల్చి చెబుతున్నారు. మేనిఫెస్టో పై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ముద్రించేందుకు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా బీజేపీ నాయకత్వం వద్ద చర్చలు జరిపారట. బతిమిలాడినా కూడా మోడీ ఫోటోను మేనిఫెస్టో పై వేసేందుకు బీజేపీ అంగీకరించలేదని, అందుకే బాబు, పవన్ ల ఫోటోలు మాత్రమే ఉన్నాయి అంటూ స్వయంగా ఆ పార్టీ కి చెందిన కొందరు నాయకులు ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు. ప్రచారంకు దూరంగా ఉండటంతో పాటు ఇలా మేనిఫెస్టో విషయంలో కూడా దూరంగా ఉండటం తో ముందు ముందు ఈ పొత్తు ఎక్కడి వరకు వెళ్తుంది అంటూ టీడీపీ, జనసేన పార్టీ నాయకుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
మూడు పార్టీలు కలిసినా కూడా జగన్ పార్టీ జోరు ను అడ్డుకునే పరిస్థితి లేదు. బీజేపీ ఇప్పుడు అంటీ ముట్టనట్లుగా వ్యవహరించడం, కూటమి ఏర్పాటు ఇష్టం లేనట్లుగా వ్యవహరిస్తే ఓట్ల బదిలీ జరిగేది ఎట్ల అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. జనసేన పార్టీ సింబల్ విషయంలో కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కనీసం పట్టించుకోలేదు. మిత్రపక్షం అయిన జనసేన పార్టీ సింబల్ ను కామన్ సింబల్ జాబితా నుంచి తొలగించేలా చేయడం మోడీ కి పెద్ద విషయం కాదు.
కానీ ఆ పని చేయలేదు. అందుకు కారణం ఏంటి అనేది మాత్రం ఆయా పార్టీల నాయకులే ఆలోచించుకోవాలి. పొత్తు పేరు చెప్పి ఏమాత్రం బలం లేకున్నా కూడా ఏకంగా 10 అసెంబ్లీ మరియు 6 పార్లమెంట్ స్థానాలను తీసుకున్న బీజేపీ ఇప్పుడు ఇష్టం లేనట్లుగా వ్యవహరించడం ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ టీడీపీ, జనసేన పార్టీకి చెందిన కొందరు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇష్టం లేని సంసారం ఎంత వరకు సాగుతుందో చూడాలి.




