KCR : ఇక రంగంలోకి కేసీఆర్.. ఆ విషయంలో కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టబోతున్నారా..?
Qubetvnews - February 17, 2024 / 11:01 AM IST
KCR :
మాజీ సీఎం కేసీఆర్ ఇక రంగంలోకి దూకబోతున్నారు. ఇన్ని రోజులు తుంటి ఆపరేషన్ వల్ల ఇంటివద్దనే ఉంటూ రెస్ట్ తీసుకున్న ఆయన.. ఇక నుంచి ప్రజాక్షేత్రం లోకి రావాలని నిర్ణయించుకున్నారు. దాదాపు కోలుకున్న ఆయన.. త్వరలోనే యాక్షన్ మోడ్ లోకి వెళ్లబోతున్నారు. కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టేందుకు రెడీ అవుతున్నారు కేసీఆర్. ఇందుకోసం ఓ ప్రత్యేక వ్యూహాన్ని రచించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు కృష్నానది జలాల వినియోగంతో పాటు ప్రాజెక్టుల నిర్వహన కేంద్రానికి అప్పగించడం మీద వివాదం నడుస్తోంది. గతంలో కేసీఆర్ దీనికి అంగీకరించారని రీసెంట్ గా రేవంత్ రెడ్డి తెలిపారు.
ఇప్పుడు తాము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అంతే కాకుండా గతంలో ఏపీ పాలకులు కేసీఆర్ హయాంలోనే నీళ్లను తరలించుకుని పోతుంటే కేసీఆర్ అడ్డుకోలదని.. పైగా నాగార్జున సాగర్ ను జగన్ రెడ్డి ఆక్రమించుకుంటే కేసీఆర్ మౌనంగా ఉండిపోయారని రేవంత్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ లో ఆరోపించారు. కాగా అదే విషయం మీద ఇప్పుడు కేసీఆర్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. కేసీఆర్ కు అన్ని ప్రాజెక్టుల మీద పూర్తి అవగాహన ఉంది. ఒకప్పుడు నీళ్ల దోపిడికి వ్యతిరేకంగా పోరాడి తెలంగాణను తెచ్చిన క్రెడిట్ కేసీఆర్ కు ఉంది.
అలాంటిది తన మీదనే ఆరోపణలు చేస్తుంటే ఎందుకు మౌనంగా ఊరుకుంటారు. అందుకే ఇప్పుడు కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. ఇదే అంశం మీద నేడు ఆయన తెలంగాణ భవన్ లో కృష్ణా పరివాహక ప్రాంతాల నాయకులతో భేటీ అవుతున్నారు. కృష్ణా నది అంశం మీదనే వారితో చర్చించబోతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి అప్పగిస్తే రైతు వ్యతిరేక విధానమే అవుతుందని.. కాబట్టి దాన్ని ప్రజలకు బలంగా ప్రచారం చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ అంశం మీదనే ఇప్పుడు యాక్షన్ ప్లాన్ రెడీ చేయబోతున్నారు.
త్వరలోనే నల్గొండలో ఇదే అంశం మీద భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు. కాబట్టి ఈ సభ నిర్వహణ మీద కూడా నేడు ఆయన నాయకులతో చర్చించబోతున్నారు. త్వరలోనే లోక్ సభ ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు.
అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద నీటి ప్రాజెక్టుల విషయంలో వ్యతిరేకత తీసుకువచ్చేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నారు. అసలు ప్రాజెక్టులను ఎలా కట్టామో, ఎలా నీటి పంపకాలు చేసుకున్నామో వాటన్నింటినీ వివరించి తమకు మళ్లీ సానుకూలత ఏర్పడేలా ప్లాన్ చేసుకుంటున్నారు కేసీఆర్.



