KCR : పార్లమెంట్ లో కేసీఆర్ ఫ్యామిలీ ఉండట్లేదా.. ఇమేజ్ తగ్గబోతుందా..?
Qubetvnews - February 27, 2024 / 09:53 AM IST
KCR :
కేసీఆర్ ఏ పని చేసినా దాని వెనకాల ఓ పెద్ద వ్యూహమే ఉంటుందని చెబుతుంటారు ఆయన అనుచర వర్గం. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో కేసీఆర్ కు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదనేది వారి వాదన. కేసీఆర్ తన పార్టీని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చుకున్నారు. దేశ రాజకీయాల్లో తన ఫ్యామిలీ ప్రధాన పాత్ర పోషించాలనేది ఆయన ఆలోచన. అలాంటప్పుడు తన కుటుంబం నుంచి ఎవరో ఒకరిని పార్లమెంట్ కు పంపాల్సి ఉంటుంది. వాస్తవానికి బీఆర్ ఎస్ పుట్టి 20 ఏళ్లు అవుతోంది. ఈ ఇరవై ఏళ్లలో ఇప్పటి వరకు కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరో ఒకరు ఎంపీగా పోటీచేస్తూ వచ్చారు.
కేసీఆర్ కరీంనగర్ నుంచి.. ఆ తర్వాత మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా గెలిచి తెలంగాణ సాధించారు. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో కవితను ఎంపీగా పంపించారు. అప్పుడు బీఆర్ ఎస్ తరఫున కవిత పార్లమెంట్ తో తన వాయిస్ వినిపించారు. ఇక 2018 ఎన్నికల్లో కూడా కవిత పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో అనుకోకుండా కవిత ఓడిపోయారు. అదే ఎన్నికల్లో కేసీఆర్ కు అత్యంత దగ్గరి బంధువు అయిన వినోద్ కుమార్ కూడా కరీంనగర్ ఎంపీగా ఓడిపోయారు. దాంతో అప్పటి నుంచి పార్లమెంట్ లో కేసీఆర్ కుటుంబ ప్రాధాన్యత కాస్త తగ్గుతూ వస్తోంది.
ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ. అయినా సరే చెప్పుకోదగ్గ ఎమ్మెల్యే సీట్లు మాత్రం కేసీఆర్ పార్టీకి వచ్చాయి. ఇలాంటి సమయంలో ఆయన ఎంపీ ఎన్నికల్లో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అదేంటంటే ఈ సారి ఎంపీ ఎన్నికలకు కవితను దూరంగా ఉంచుతున్నారంట. కవిత ఇప్పుడు లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఆమెను ఇప్పటికే సీబీఐ పలుమార్లు విచారించింది. మొన్ననే ఆమెను నిందితురాలిగా కూడా చేర్చింది. దాంతో కేసీఆర్ ఆమెకు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు వెనకడుగు వేశారు. ఇక్కడ కేసీఆర్ మరో ఆలోచన కూడా చేస్తున్నారంట.
అదేంటంటే కుటుంబ పాలన అనే రిమార్క్ ను పోగొట్టుకోవడానికే కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీ ఓడిపోవడానికి ఇది కూడా పెద్ద కారణమే. కేసీఆర్ కుటుంబ పాలన చేస్తున్నాడని ప్రతిపక్షలు పదే పదే ఆరోపణలు చేశాయి. దాంతో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది.
అందుకే ఇప్పుడు కవితను పార్లమెంట్ కు పంపించకుండా వెనకడుగు వేస్తున్నారంట కేసీఆర్. కానీ పార్లమెంట్ లో బీఆర్ ఎస్ కు సుదీర్ఘ అనుభవం ఉంది. పైగా బీఆర్ ఎస్ అని పేరు పెట్టుకున్నప్పుడు దేశ రాజకీయాల్లో కేసీఆర్ కుటుంబం లేకపోవడం అనేది ఆయన ప్రాధాన్యతను తగ్గిస్తుందని అంటున్నారు.




