BRS : ఆరు గ్యారెంటీలే బీఆర్ఎస్ కు ప్రచార అస్త్రాలు.. ప్లాన్ అదిరిందిగా..!
Qubetvnews - February 23, 2024 / 10:43 AM IST
BRS :
బీఆర్ఎస్ ను తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ పార్టీకి పోరాటం అనేది వెన్నతో పెట్టిన విద్య. అసలు ఆ పార్టీ పుట్టిందే ఉద్యమాల నుంచి. అధికారంలో ఉన్నప్పుడు చాలా విషయాలను కేసీఆర్ సర్కార్ లైట్ తీసుకుంది. వాటిని ఆధారంగా చేసుకుని రేవంత్ రెడ్డి తీవ్రంగా పోరాడి మరీ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చారు. అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలే ఇప్పుడు రేవంత్ సర్కార్ కు పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి. పైగా అన్ని ఉచిత హామీలు కావడంతో వాటిని అమలు చేయడం ఇప్పుడు పెద్ద సవాల్ గా మారిపోయింది.
ఎందుకంటే వాటిని అమలు చేసేంత డబ్బులు ఇప్పుడు ప్రభుత్వంలో లేవు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ముందూ వెనక ఆలోచించకుండా ఓ మాట ఇచ్చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో హామీలను అమలు చేస్తామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు రెండు గ్యారెంటీలను మాత్రమే అమలు చేసింది. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయడానికి ఇంకో మూడు వారాలు అంటే మార్చి మొదటి వారంలోపు కంప్లీట్ చేయాలి. కానీ వాస్తవ పరిస్థితులను చూస్తుంటే అది సాధ్యం అయ్యేలా కనిపించట్లేదు. సాధారణంగా ఏ పార్టీ కూడా వంద శాతం హామీలను అమలు చేయలేదు.
అందుకే ప్రధాన హామీలను కొన్నింటిని అమలు చేసి మిగతా వాటిని పక్కన పెట్టేస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయాలంటే ఏడాదికి సుమారు రు. 1.54 లక్షల కోట్లు అవసరమైతే కాంగ్రెస్ మొన్నటి బడ్జెట్లో కేటాయించింది కేవలం రు. 53 వేల కోట్లు మాత్రమే. ఇదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద బలం అయిపోతోంది. కాంగ్రెస్ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేసేంత సీన్ అయితే కనిపించట్లేదు. ఎందుకంటే బడ్జెట్ కేటాయింపులను చూస్తేనే ఈ విషయం అర్థమైపోతోంది. కాబట్టి ఇప్పుడు దీన్నే ఎంపీ ఎన్నికల్లో ప్రచార అస్త్రాలుగా వాడుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది.
ఎంపీ ఎన్నికల్లోపు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేసి మెజార్టీ సీట్లు సాధించాలని టార్గెట్ పెట్టుకుంటే అది సాధ్యం కాదని బీఆర్ ఎస్ కు అర్థమైంది. దాంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఫేక్ అని బీఆర్ ఎస్ ప్రచారం చేయడానికి రెడీ అయిపోయింది. కాంగ్రెస్ బడ్జెట్ కేటాయించలేదు కాబట్టి.. హామీలను అమలు చేయడం సాధ్యం కాదని.. కాబట్టి కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందంటూ ప్రచారం చేయడానికి రెడీ అయిపోతోంది.
ఇది ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మద్దతు కూడగట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కాంగ్రెస్ మీద ప్రజల్లో వ్యతిరేకత తీసుకువచ్చేందుకు బీఆర్ ఎస్ ఆరు గ్యారెంటీలే ప్రచార అస్త్రాలు అని.. వాటిని సోషల్ మీడియాలో బలంగా ప్రచారం చేయాలని.. త్వరలోనే ఇంటింటికీ ప్రచారం చేయాలని బీఆర్ ఎస్ ప్లాన్ వేస్తోంది. ఇది బీఆర్ఎస్ కు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు రాజకీయ నిపుణులు.



